Friday, November 22, 2024

స్విగ్గీలో 380 మంది తొలగింపు..

ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వ్యయభారం నుంచి గట్టెక్కేందుకు కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. 380 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంబంధిత వ్యక్తులకు ఈ మెయిల్‌ సందేశాలు పంపినట్లు స్విగ్గీ సీఈవో తెలిపారు. సంస్థ పునర్నిర్మాణ చర్యలో భాగంగా అత్యంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఫుడ్‌ డెలివరీ సెగ్మెంట్‌లో వృద్ధిరేటు మందగించింది. మందగమనంతో లాభాలు సన్నగిల్లి రాబడి తగ్గింది. ఇబ్బడిముబ్బడిగా హైరింగ్‌ చేపట్టడం కూడా తాజా కోతలకు మరొక కారణం.

తొలగించిన ఉద్యోగులకు బాసటగా నిలుస్తాం. మూడు నుంచి ఆరు నెలల్లోగా వారికి నగదు సాయం అందిస్తాం. కంపెనీలో వారు పనిచేసిన వ్యవధి, గ్రేడ్‌ ఆధారంగా ఈ పరిహారం ఉంటుంది. ఉద్వాసనకు గురైన వారికి మూడు నెలల వేతనం, ఒక్కో ఏడాది సర్వీసుకు 15 రోజుల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఎర్న్‌డ్‌ లీవులకు చెల్లింపులు చేయడం జరుగుతుంది. అన్ని కోణాల్లో సమగ్ర పరిశీలన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని సీఈవో పేర్కొన్నారు.

- Advertisement -

అలాగే మాంసం విక్రయాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని కూడా మూసివేస్తున్నట్లు చెప్పారు. ఇన్‌స్టామార్ట్‌ ద్వారా ఆ విక్రయాలు కొనసాగిస్తామని తెలిపారు. కొత్త విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగుతాయని అన్నారు. ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌, ఆపరేషన్‌ డిపార్టుమెంట్లలో ఈ ఉద్యోగాల కోత ఉండొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2021లో రూ.1617 కోట్లుగా ఉన్న కంపెనీ నష్టాలు, గతేడాది రూ.3628 కోట్లకు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement