పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఖైబర్ ఫంఖ్తువా ప్రావిన్సులోని కుర్రం జిల్లాలో ప్రయాణికుల వాహనాలపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 38మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. మృతులలో ఆరుగురు మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఇటీవలి నెలల్లో డజన్ల కొద్దీ ప్రాణాలను బలిగొన్న మతపరమైన హింసతో ఈ సంఘటనలు ముడిపడి ఉన్నాయని అధికారులు తెలిపారు.
‘షియా ప్రజల రెండు వేర్వేరు కాన్వాయిలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జావేద్ ఉల్లా మెహసూద్ చెప్పారు. రెండు సంఘటనలలో సుమారు 10 మంది దుండగులు పాల్గొన్నట్లు సమాచారం. రెండు కాన్వాయ్‌లలో దాదాపు 40 వాహనాలు పోలీసు ఎస్కార్ట్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
వాయువ్య ఖైబర్ ఫఖ్తువా ప్రావిన్స్‌లోని కుర్రమ్‌లో సున్నీ, షియా ముస్లిం తెగలు తరచూ పరస్పర ఘర్షణలకు పాల్పడుతుంటాయి. అక్టోబర్‌లో జరిగిన మత ఘర్షణలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా కనీసం 16 మంది చనిపోయారు. జులై, సెప్టెంబరులోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. డజన్ల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.