Friday, November 22, 2024

వడ్డీ లేని రుణం కింద ఏపీకి 3,769 కోట్లు.. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు మంత్రి సమాధానం

ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన మొత్తంలో ఎక్కువ భాగం విద్య, ఆరోగ్య రంగాల్లో మూలధన పెట్టుబడులకు వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 26 జిల్లాల్లో పాఠశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులైన “మన బడి నాడు నేడు” ఫేజ్-2 అమలు కోసం రూ.1,738 కోట్ల భారీ మొత్తం మంజూరైంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భవనాల నిర్మాణం, పరికరాల కొనుగోలు, చాలా జిల్లాల్లో రెండో పీహెచ్‌సీ భవనాల నిర్మాణానికి మరో రూ.1,504 కోట్లు మంజూరయ్యాయి.

- Advertisement -

మిగిలిన రూ.554 కోట్లు YSR కడప జిల్లాలో పారిశ్రామిక నీటి సరఫరా సహా ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేయాల్సిందిగా కేంద్రం నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయ ఆర్థిక సహాయం అందించడంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానిస్తూ, ‘నాడు నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాలలకు సామాజిక మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడంలో ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ఉదారంగా ఆర్థిక సహాయం చేస్తున్న విషయాన్ని విస్మరించవద్దని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య, విద్యా రంగాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌కు పెద్దపీట వేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందని, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందని జీవీఎల్ ఆరోపించారు. వివిధ పథకాలు, ప్రాజెక్టుల కింద రాష్ట్రానికి కేంద్రం సహాయం చేయడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌లో కనిపించే అభివృద్ధి అంతా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement