Friday, November 22, 2024

జీఎస్టీ వసూళ్ళలో 37 శాతం వృద్ధి, ఐదేళ్ల పాటు పరిహారం చెల్లిస్తాం.. విజయసాయి ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇటీవల కాలంలో జీఎస్టీ వసూళ్ళలో గణనీయమైన వృద్ధి నమోదవుతున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2022-23 తొలి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్ళు సగటున నెలకు రూ. 1.51 లక్షల కోట్లకు చేరిందన్నారు. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన జీఎస్టీ వసూళ్ళతో పోల్చుకుంటే 37 శాతం వసూళ్ళు పెరిగాయని చెప్పారు. జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపును మరో 5 సంవత్సరాల పాటు పొడింగించాలన్న వివిధ రాష్ట్రాల డిమాండ్‌పై ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ ఏం నిర్ణయించింది అన్న ప్రశ్నకు మంత్రి నేరుగా సమాధానం చెప్పలేదు.

జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపును మరో అయిదేళ్ళపాటు కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కొన్ని రాష్ట్రాలు కోరిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. అయితే జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్లపాటు రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించాలన్న రాజ్యాంగపరమైన హామీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తదుపరి మరో ఐదేళ్లు పొడిగించాలన్న అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న విషయంలో సమాధానం దాటవేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement