మాస్కో: రష్యా గ్యాస్ స్టేషన్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 35కు పెరిగింది. మరో 102 మంది గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మంగళవారం ఉదయం 6.00 గంటల సమయంలో లోని మఖచ్‌కాలాలో పేలుడు సంభవించిందని డగెస్టాన్ రీజియన్ హెడ్ సెర్గీ మెలికోవ్ తెలిపారు.
గ్యాస్ స్టేషన్ పేలుడుకు ముందే దానికి ఎదురుగా ఉన్న కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో పేలుడు సంభవించిందని, ఆ మంటలు చుట్టూ 600 మీటర్ల పరిధి వరకు విస్తరించాయన్నారు. ఆ క్రమంలోనే గ్యాస్ స్టేషన్‌కు మంటలు అంటుకుని ఇంధన ట్యాంకులు పేలిపోయాయని మెలికోవ్ చెప్పారు. గ్యాస్ స్టేషన్‌లోని మొత్తం 8 ఇంధన ట్యాంకుల్లో 2 ట్యాంకులు పేలిపోయాయన్నారు. హీట్ కారణంగా మళ్లీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉండటంతో స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.