Friday, November 22, 2024

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దంలో 346 చిన్నారులు మృత్యువాత..

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టడం వల్ల అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు 346 చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో 645 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇవి పూర్తి గణాంకాలు కావని.. ఇంకా మరికొన్ని ప్రాంతాల నుంచి దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉందని ప్రకటనలో తెలిపింది. జనావాసాలపై దాడిచేయబోమని ముందు నుంచి చెబుతూనే రష్యా దానికి విరుద్దంగా దాడులు కొనసాగిస్తోంది. ఏ మాత్రం కనికరం లేకుండా విద్యా సంస్థలపైనా బాంబు దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 2,108 విద్యా సంస్థలు దెబ్బతిన్నాయి. వాటిలో 215 పూర్తిగా ధ్వంసమయ్యాయి.

యునిసెఫ్‌ మే నెలలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఉక్రెయిన్‌లో సుమారు 3 మిలియన్ల పిల్లలు ఉన్నారు. శరణార్థులకు ఆతిథ్యమిచ్చే దేశాల్లో దాదాపు 2.2 మిలియన్లకు పైగా పిల్లలు మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఉక్రెయిన్‌లో పిల్లల రక్షణ సంక్షోభానికి రష్యా చేస్తున్న యుద్దమే కారణమైందని యూనిసెఫ్‌ హెచ్చరించింది. దేశం వీడి పారిపోతున్న పిల్లలపై లైంగిక దాడి. అక్రమ రవాణా జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. మరో వైపు రష్యా చేస్తున్న యుద్దం కారణంగా ఉక్రెయిన్‌ దేశంలోని ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఇతర దేశాలకు తరలి వెళ్లినట్లు ఐరాస ఏజెన్సీ నివేదించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement