Tuesday, November 26, 2024

ఎపి మండ‌లికి కొత్త రూపు…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ శానస మండలిలో గతంలో బలమైన సామాజివక వర్గాల ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపించేది. ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి చివరి నిమిషంలో చేజారిన వారికే శాసన మండలిలో అవకాశం కల్పించేవారు. అయితే, అందుకు పూర్తి భిన్నంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండలిలో వెనుకబడిన సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని క్రమేణా పెంచుతూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం 58 మంది సభ్యులు ఉన్న శాసన మండలి లో 60 శాతం మందికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఎమ్మెల్సీలుగా సభలో కనిపిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 90 మంది సభ్యులున్న మండలిలో 65 శాతం మందికిపైగా బలమైన సామాజికవర్గాలే కనిపించె వారు. అయితే, రాష్ట్రంలో రాజకీయంగా వెనుకబడి పోతున్న బలహీనవర్గాలను మరింత ముందుకు తేవా లన్న సంకల్పంతో సీఎం జగన్‌ సాధారణ ఎన్నికల నుండి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ వెనుకబడిన సామాజిక వర్గాలకే అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బడుగులు అత్యధికంగా చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. వారి సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. సీఎం జగన్‌ కూడా ఆ ఉద్దేశ్యంతోనే శాసనసభతోపాటు మండలిలోనూ వారి ప్రాధాన్యతను పెంచుతూ వస్తున్నారు. తాజాగా 23 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఎన్నికల్లో కూడా వైసీపీ నుండి వెనుకబడిన సామాజికవర్గాలకే అత్యధిక స్థానాలను కేటాయించారు. ప్రత్యేకించి ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటాతోపాటు 9 స్థానిక సంస్థల శాసన మండలి స్థానాలకు సంబంధించి 70 శాతానికిపైగా టిక్కెట్లను వారికే కట్టబెట్టారు. దీనినిబట్టి చూస్తుంటే వెనుకబడిన సామాజికవర్గాలు మండలిలో ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో స్పష్టంగా అర్ధమౌతోంది.

మండలిలో మరింత పెరిగిన వైసీపీ బలం :
58 మంది సభ్యులున్న శాసన మండలిలో గతంలో టీడీపీ అత్యధిక స్థానాలతో బలంగా కనిపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ తన బలాన్ని క్రమేణా పెంచుకుంటూ పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుండి 40 మంది శానస మండలిలో సభ్యులుగా ఉన్నారు. వైసీపీ నుండి కేవలం 9 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆ సంఖ్య పూర్తిగా వైసీపీకి మరింత బలాన్ని చేకూర్చేలా పెరిగింది. దీంతో ఇప్పటికే శానసభలో బలంగా ఉన్న అధికార వైసీపీ మండలిలో కూడా అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీకి రెండు స్థానాలు, పీడీఎఫ్‌కు 4, ఇండిపెండెంట్లుకు మరో 4 స్థానాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఈనెల 29వ తేదీ, మే 1తో సుమారు 23 మంది సభ్యుల పదవీ కాలం పూర్తి కాబోతోంది. దీంతో గవర్నర్‌, ఎమ్మెల్యే కోటాలోని 9 స్థానాలతోపాటు స్థానిక సంస్థలకు సంబంధించిన మరో 9 స్థానాలు దాదాపుగా వైసీపీ సొంతం చేసుకోబోతోంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి 5 స్థానాలు వైసీపీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. బీజేపీ స్థానంలో కూడా ఖాళీ కాబోతున్నాయి. వాటిని కూడా అధికార వైసీపీ సొంతం చేసుకోబోతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల 5 స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మార్చి 29 తరువాత మండలిలో వైసీపీ 45 మందికిపైగా సభ్యులతో వైసీపీ పూర్తి ఆధిపత్యాన్ని చలాయించబోతోంది.

సామాజికవర్గాలకు పెద్ద పీట :
రాష్ట్ర విభజన అనంతరం 2014 నుండి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో శానసమండలిలో 48 స్థానాలకుపైగా అప్పటి అధికార పక్షం టీడీపీ సభ్యులే ఉన్నారు. అందులో 30 మంది ఓసీ సామాజికవర్గానికి చెందిన వారు కాగా, 18 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు కేటాయించారు. అయితే, సీఎం జగన్‌ అందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుతం భర్తీ చేస్తున్న 18 స్థానాలతో కలిపి 68 శాతానికిపైగా వెనుకబడిన వర్గాలకే కేటాయించారు. ప్రస్తుతం వైసీపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నవారిలో ఓసీల నుండి 14 మంది, బీసీల నుండి 19, ఎస్సీ సామాజికవర్గం నుండి 6, ఎస్టీ నుండి ఒకరు, మైనార్టీ నుండి నలుగురు మొత్తం మీద 44 మంది సభ్యులతో వైసీపీ వెనుకబడిన సామాజికవర్గాలకే పెద్ద పీట వేసింది.

సీఎం జగన్‌ సరికొత్త విధానం .. వెనుకబడిన సామాజికవర్గాల్లో పెరుగుతున్న జోష్‌
వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించడంతోపాటు రాజకీయంగా మరిన్ని అవకాశాలు ఆసామాజికర్గాలకు కల్పించాలని సీఎం జగన్‌ సంకల్పించారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం వెనుకబడిన వర్గాలకే కేటాయించేలా కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఆదిశగానే గత ఏడాది రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో వారికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. తాజాగా శాసన మండలిలో కూడా వారి ప్రాతినిధ్యాన్ని పెంచి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన సామాజికవర్గాల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement