Tuesday, November 26, 2024

వచ్చే మూడేళ్లలో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు.. డీజిల్‌ వ్యయ భారం నుంచి గట్టెక్కేందుకు టీఎస్‌ ఆర్టీసీ యోచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నష్టాల బాట నుంచి గట్టెక్కే దిశగా అడుగులు వేస్తున్న టీఎస్‌ ఆర్టీసీ ఇక డీజిల్‌ బస్సులకు స్వస్తి పలుకనుంది. ఇప్పటి వరకు డీజిల్‌ బస్సులనే నడుపుతున్న ఆర్టీసీ క్రమంగా ఎలక్ట్రిక్‌ బస్సుల వైపు చూస్తోంది. భారీగా పెరుగుతున్న డీజిల్‌ ధరలు సంస్థ మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుండటంతో నిర్వహణాపరమైన ఖర్చును తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులను సమకూర్చుకోనుంది. అయితే, డీజిల్‌ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ బస్సుల ధర చాలా ఎక్కువ. ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీలో తిరిగే డీజిల్‌ బస్సు రూ.35 లక్షలు ఉండగా, నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సు ధర రూ.కోటిన్నర వరకు పలుకుతోంది. అంత మొత్తం వెచ్చించి వాటిని కొనడం ప్రస్తుతం ఆర్టీసీకి తలకు మించిన భారం కానున్న దృష్ట్యా ప్రముఖ బస్సుల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ కంపెనీ నుంచి అద్దె ప్రాతిపదికన 500 బస్సులు సమకూర్చుకోనుంది.

- Advertisement -

టెండర్ల ప్రక్రియలో ఆ సంస్థ ఎల్‌1గా నిలిచింది. అయితే, కి.మీ.కు రూ.58 చొప్పున అశోక్‌ లేలాండ్‌ సంస్థ కోట్‌ చేయగా, దాన్ని కనీసం రూ.54కు తగ్గించాలని ఆర్టీసీ సదరు సంస్థకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై ఆ సంస్థ ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. రానున్న రెండు మూడు రోజుల్లో అశోక్‌ లేలాండ్‌ సంస్థ దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆ సంస్థకే బస్సుల నిర్వహణ బాధ్యతను సైతం అప్పగించింది. కాగా, టీఎస్‌ ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులు పెరుగుతున్నందున వాటి చార్జింగ్‌ కోసం ప్రత్యేకంగా డిపోలను ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఏయే డిపోలకు ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయిస్తారో ఆయా డిపోల్లో ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు అవసరం.

అయితే, ఎలక్ట్రిక్‌ బస్సుల చార్జింగ్‌కు సంబంధించి అదనంగా 33 కెవి ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమా, లేక 11 కెవి సరిపోతుందా అనే విషయంపై టీఎస్‌ ఆర్టీసీ అధికారులు విద్యుత్‌ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇందుకోసం ఇటీవలే ఓ అధికారిని ప్రత్యేకంగా కేటాయించారు. గతంలో ఇంజనీరింగ్‌ విభాగం బాధ్యతలు చూసిన ఈడీ వినోద్‌ను తప్పించి చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కాగా, అశోక్‌ లేలాండ్‌ సంస్థ ఆర్టీసీకి డబుల్‌ డెక్కర్‌ బస్సులను కూడా సరఫరా చేయనుంది. తొలుత 10 బస్సులను జీహెచ్‌ఎంసి పరిధిలో నడుపనుంది. దీనిని నిర్వహించే బాధ్యతను కూడా ఆ సంస్థకే అప్పగించింది. ఇందుకోసం సంస్థ కి.మీ.కు రూ.79 అద్దె ఇవ్వాలని టీఎస్‌ ఆర్టీసీకి ప్రతిపాదించగా, దాన్ని కొంతమేర తగ్గించాలని ఆర్టీసీ అధికారులు అశోక్‌ లేలాండ్‌ కంపెనీని కోరారు. త్వరలో దీనిపై కూడా నిర్ణయం వెలువడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement