అమరావతి, ఆంధ్రప్రభ : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈవీ వాహనాల వినియోగం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. రాబోయే రోజుల్లో ఈవీ వాహనాలదే యుగం అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాలను ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదా పద్దతుల్లో ఇస్తున్నారు. అంతేకాకుండా ఈవీ వాహనాల కొనుగోలులో కూడా రాయితీలు కల్పిస్తున్నారు. ఈనేపథ్యంలో ఈవీ వాహనాల్లో కీలకమైన లిథియం బ్యాటరీల తయారీలో ముడి ఖనిజమైన లిథియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దీనిని ఒక ఆదాయ వనరుగా మార్చుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది.
అందులో భాగంగా మైనింగ్ కంపెనీలు లిథియంను వెలికితీసేందుకు చెల్లించాల్సిన రాయల్టీ రేటును లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (ఎల్‌ఎంఈ)లో ఉన్న ధరలలో 3 శాతంగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను తయారు చేయడానికి ఉపయోగించే కీలకమైన ముడిసరుకు లిథియం. ఈ ఖనిజం సరఫరాకు సురక్షిత మార్గాలను అన్వేషిస్తున్న కేంద్రం ఫిబ్రవరిలో జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతంలో లిథియం నిక్షేపాలను కనుగొంది.
ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో 5.9 మిలియన్ టన్నుల నిల్వలతో కొత్తగా కనుగొన్న లిథియం బ్లాకులను వేలం వేయాలని భావిస్తోంది. ఈ వేలంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, వేదాంత లిమి-టె-డ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, హిమాద్రి కెమికల్స్, కొరియాకు చెందిన ఎల్‌ఎక్స్ ఇంటర్నేషనల్ వంటి కనీసం డజను దేశ, విదేశీ కంపెనీలు పాల్గొనే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
3 శాతం రాయల్టి ప్రతిపాదన
ఎల్‌ఎంఈలో ఉన్న రేట్లలో 3 శాతం లిథియం మైనింగ్ రాయల్టీ రేటును నిర్ణయించే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ పరిశీలిస్తుంది. దీనిపై గనుల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరాయల్టీ రేటు – జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారత దేశం యొక్క లిథియం బ్లాక్‌ల మొదటి వేలం వైపు ఒక ప్రధాన అడుగు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశ సమాఖ్య గనుల మంత్రిత్వ శాఖ రాయల్టీ రేట్లను నిర్ణయిస్తుంది, అయితే ఈఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలకు వెళుతుంది.
గతంలోనూ ఎల్‌ఎంఈ బెంచ్ మార్క్
బాకై-్సట్ తవ్వకాల కోసం రాయల్టీ రేటు-ను నిర్ణయించడానికి భారతదేశం గతంలో ఎల్‌ఎంఈ బెంచ్‌మార్క్‌ను ఉపయోగించిందని ఆయా వర్గాలు తెలిపాయి. ఇతర లిథియం మైనింగ్ దేశాలలో రాయల్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం ఇప్పటికే అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఆస్ట్రేలియాలో రాయల్టీ రేట్లు కూడా ఎల్‌ఎంఈలో 3 శాతం ఉన్నట్లు ఈ సందర్బంగా అధ్యయన బృందం గుర్తించింది. ఇక అర్జెంటీనా, బొలీవియా, చిలీలో ఎల్‌ఎంఈలో ఇది 4.5 శాతం ఉందని, దీనిని లిథియం ట్రయాంగిల్ అంటారని అధికారి పేర్కొన్నారు.
భారతదేశం తన లిథియం నిల్వను వేలం వేయాలని యోచించడం ద్వారా ప్రపంచలోనే ఏడవ అతిపెద్ద డిపాజిట్‌గా అంచనా వేయబడిందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు ఇతర దేశాలు లిథియంతో సహా కీలకమైన ఖనిజాల సరఫరాను భద్రపరిచే లక్ష్యంతో కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు- చేశాయి. ఈనేపథ్యంలోనే భారత్ లిథియంపై మైనింగ్ రాయల్టిని ఎల్‌ఎంఈలో 3 శాతం మేర విధించి, తొలిసారి అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయాలకు శ్రీకారం చుట్టడం హర్షణీయం.