ఆంధ్రప్రభ, హైదరాబాద్: ఇక వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు పండుగ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80వేల ఖాళీలను గడువులోగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఆర్ధిక శాఖ అనుమతులతో అన్ని నియామక సంస్థలు కార్యాచరణ వేగవంతం చేస్తున్నాయి. డిసెంబర్ 8నుంచి పోలీస్ నియామక అర్హత అభ్యర్ధుల ఫిజికల్ టెస్టులు ప్రారంభం కానుండగా, త్వరలో గ్రూప్-1 మోయిన్స్ నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్‌ను జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తంగా 60929 పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతులు జారీ చేయడంతో నోటిఫికేషన్ల జారీ దిశగా ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోంది.
మిగిలిన 16940 ఉద్యోగాలకు త్వరలో ఆర్ధిక శాఖ పరిపాలనా అనుమతులకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ మాసంలో గ్రూప్2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నోటిఫికేషన్ల జారీకి వీలుగా టీఎస్‌పీఎస్సీ రోజు సమావేశాలను నిర్వహిస్తోంది. 34శాఖల అధికారులతో సంప్రదింపులతో పోస్టుల భర్తీకి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నది. మరో 16 ,940 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సోమేశ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జరీ చేసేందుకు నియామక సంస్థలు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు.
మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు శాఖల్లో నియామక ప్రక్రియను సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్ మెంట్ బోర్డు తదితర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా భర్తీ ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు , రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్‌సికి వెంటనే సమాచారం అందిస్తే, వాటి ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమీషన్ వచ్చే నెలలో నోటిఫికేషన్‌లు జారీ చేస్తుందని పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.