Friday, November 22, 2024

హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. 29 రోజులకు రూ.24 లక్షల బిల్లు

కరోనా వైరస్ విజృంభణ కారణంగా హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. కొందరికి బెడ్లు కూడా దొరకక ప్రాణాలను కోల్పోతున్నారు. కొన్ని ఆసుపత్రులు మాత్రం కరోనా పరిస్థితులను బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. చికిత్స కోసం వచ్చిన బాధితుల నుండి లక్షలు లక్షలు బిల్లు వసూలు చేసి బ్రతుకుండగానే బిల్లులు కట్టేందుకు వారి నగానట్రా, ఆస్థిపాస్తులు అమ్ముకునేలా చేస్తున్నాయి.

ఇలాంటి సంఘటనే నాగోలు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది. చికిత్స కోసం గత నెలలో ఓ కరోనా బాధితుడు జాయిన్ అవ్వగా వైద్య ఖర్చులకు ఆసుపత్రి యాజమాన్యం వేసిన బిల్లు చూసి బాధితుడు జడుసుకున్నాడు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి గత నెల 15న నాగోలు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అతని పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. గత వారం కోలుకోగా నిన్న డిశ్చార్జి చేస్తామని చెప్పి, చేసే ముందు అతని చేతిలో రూ. 24 లక్షల బిల్లు పెట్టారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులకు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఐసీయూ లో చికిత్స తీసుకునే కరోనా బాధితుడికి రోజుకు రూ. 9,000, అదే ఆక్సిజన్‌ బెడ్‌కు రూ.7,000, సాధారణ వార్డుకు మాత్రం రూ.4,000 చొప్పున తీసుకోవాలని సూచించింది. కానీ ఆ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం రూ.24 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపుతామని, కట్టకపోతే డిశ్చార్జి చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో అంత డబ్బు కట్టలేక ఏమి చేయాలో తోచక బాధితుని బంధువులు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement