న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలోని వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో తక్షణమే తొలి విడతగా 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాడం్ చేసింది. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గురువారం భారీ ధర్నా నిర్వహించింది. సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దాసు సురేష్ నేతృత్వంలో కొనసాగిన బీసీ మహా ధర్నా లో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎంపీలు, జేఎన్యూ విద్యార్థులు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ప్రాంతాల బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
పార్లమెంటు ఉభయ సభల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్న బీజేపీ గత ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో రాజ్యాంగ సవరణల ద్వారా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్, రాజకీయ రిజర్వేషన్లను చట్టబద్దం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి తీర్మానానికి బీసీ మహా ధర్నాకు విచ్చేసిన అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతు పలికాయని దాసు సురేష్ తెలిపారు.
బీసీలకు ప్రస్తుతం కొనసాగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల ఆధారంగా అసెంబ్లీ, పార్లమెంట్లోనూ 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్ల బీసీలు ఎంతో నష్టపోతున్నారని సీపీఐ ఎంపీ అజీజ్ బాషా అన్నారు. బీసీ ప్రధానిగా మోదీ ఉన్న తరుణంలొనే దీనికి పరిష్కారం లభించాలని ఆయన ఆకాంక్షించారు.