హైదరాబాద్, ఆంధ్రప్రభ: యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 16 నుంచి 25వ తేదీల మధ్య సివిల్స్ మెయిన్స్ రాత పరీక్షలు జరిగాయి. ప్రిలిమ్స్ అర్హత సాధించిన దాదాపు 15 వేల మంది దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 700 మంది మెయిన్స్ రాశారు. పరీక్ష రాసిన వారిలో ఒక పోస్టుకు 2.5 చొప్పున మొత్తం 2529 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. దీని ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందమంది ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలుగుతున్నారు.
దేశవ్యాప్తంగా సివిల్ సర్వీస్ పోస్టులు 1044 భర్తీ చేయాలని యూపీపీఎస్సీ ప్రకటించింది. అయితే మెయిన్స్‌లో అర్హత పొందిన వారికి జనవరి రెండో వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకూ డిటైల్డ్ అప్లికేషన్ ఫాం-2 పూర్తి చేయాలని అభ్యర్థులకు ఈమేరకు యూపీపీఎస్సీ సూచించింది. ఇంటర్వ్యూలో, మెయిన్స్‌లో వచ్చే మార్కులను కలిపి ఫైనల్ ర్యాంకు ప్రకటిస్తారు.
ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ముగ్గురు
తెలంగాణలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. స్టడీ సర్కిల్ నుంచి మొత్తం 16 మంది మెయిన్స్ రాశారు. వరంగల్ జిల్లా ములుగుకు చెందిన డి.ప్రవీణ్, జనగామకు చెందిన కె.ప్రణయ్, నిజామాబాద్‌కు చెందిన డి.కిరణ్ కుమార్ ఎంపికైన వారిలో ఉన్నారు. సివిల్స్‌లో సత్తా చాటిన అభ్యర్థులను రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈమేరకు అభినందించారు.