Tuesday, November 26, 2024

గ్రూప్‌-1 మెయిన్స్‌ రాసేది 25 వేల మంది.. ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున ఎంపిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 పోస్టులకు కటాఫ్‌ మార్కులు ఉండవని టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. మెయిన్స్‌ పరీక్షకు షాట్‌ లిస్టు చేయడానికే ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించినట్లు ఈమేరకు పేర్కొంది. ప్రిలిమినరీ పరీక్ష ఆధారంగా 1:50 మధ్య అభ్యర్థులను షార్ట్‌ లిస్టు చేస్తామని తెలిపింది. జోన్‌లలో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు ఆధారంగా నియామకాలు జరుగుతాయని వెల్లడించింది. ఖాళీలను బట్టి ఒక్కో కేటగిరీలో ఒక్కో పోస్టుకు 1:50 మంది చొప్పున మెయిన్స్‌కి క్వాలిఫై చేస్తామని ప్రకటించింది.

మెయిన్స్‌ రాసేది 25,150 మంది…

తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం జరిగిన పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. 503 గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3.80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 2,86,051 మంది పరీక్ష రాశారు. త్వరలో నిర్వహించే గ్రూప్‌-1 మెయిన్స్‌కు 25,150 మంది మాత్రమే రాయనున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించినట్లుగా 503 పోస్టులకుగానూ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయనున్న నేపథ్యంలో ప్రిలిమినరీలో అర్హత సాధించిన 25,150 మందిని ఈమేరకు మెయిన్స్‌కు ఎంపిక చేయనుంది. వీరు మాత్రమే మెయిన్స్‌ పరీక్షకు హాజరుకానున్నారు. ప్రిలిమినరీ పేపర్‌ చాలా టఫ్‌గా రావడంతో మెయిన్స్‌కు కటాఫ్‌ మార్కులు ఎంత ఉంటాయి? అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో కటాఫ్‌ మార్కులు అసలు ఉండవని, రిజర్వేషన్లు, ఉన్న ఖాళీల ఆధారంగా ఒక్కో కేటగరీలో ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున మెయిన్స్‌కి అర్హులుగా ప్రకటిస్తామని సోమవారం కమిషన్‌ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని ఐదారు రోజుల్లో విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement