Tuesday, November 19, 2024

బైజూస్‌లో 2,500 మంది ఉద్యోగుల తొలగింపు.. నష్టాల్లో ఉన్న స్టార్టప్​ కంపెనీ

ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ 2,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం. నష్టాలు తగ్గించుకునేందుకే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు బైజూస్‌ తెలిపింది. బైజూస్‌లో మొత్తం 50 వేల మంది పని చేస్తున్నారు. టెక్నాలజీని మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని, డూప్లికేషన్‌ లేకుండా చూసుకోవాలని కంపెనీ నిర్ణయించింది. ఈ సంవత్సరం జూన్‌లో అనుబంధ సంస్థలైన వైట్‌ హ్యాట్‌, టాపర్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించింది. 2023 నాటికి కంపెనీ లాభాల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

బైజూస్‌కు అనుబంధంగా మరికొన్ని సంస్థలను కూడా ఒకే యూనిట్‌ కిందకు తీసుకు రానున్నారు. ఆకాష్‌, గ్రేట్‌ లెర్నింగ్‌ సంస్థలు మాత్రం ఎప్పటిలాగే ప్రత్యకంగా పని చేస్తాయి. 2021, మార్చ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బైజూస్‌ 4,588 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం కంటే 19 రేట్లు ఎక్కువ. కంపెనీ షేర్‌ హోల్డర్ల నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉందని, ఇందుకు ఆదాయం పెంచుకోవడంతో పాటు, కంపెనీ సమగ్రాభివృద్ధి చెందాల్సి ఉందని బైజూస్‌ ఇండియా బిజినెస్‌ సీఈఓ మరినల్‌ మోహిత్‌ చెప్పారు. బైజూస్‌ చాలా కంపెనీలను కొనుగోలు చేసింది. ఈ కంపెనీలన్నింటిని లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రానున్న కాలంలో మరో 10 వేల మంది టీచర్లను తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం బైజూస్‌లో 20 వేల మంది టీచర్లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement