ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో టాటా మోటార్స్, ఉబెర్ మధ్య అతి పెద్ద ఒప్పందం కుదిరింది. ఉబెర్‌కు టాటా మోటార్స్ 25,000 ఈవీ ఎక్స్‌ప్రెస్ట్ కార్లను సరఫరా చేయనుంది. ఉబర్ ఈ ఈవీ సిడాన్ కార్లను ప్రీమియం సర్వీస్ కేటగిరిలో వినియోగించనుంది. టాటా విద్యుత్ ఎక్స్‌ప్రెస్ట్ కార్లను ఢిల్లి ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నయ్, హైదరాబాద్, బెంగళూర్, అహ్మదాబాద్ నగరాల్లో వినియోగించనుంది. ఈ నెల నుంచి ఈవీ కార్లను ఉబెర్‌కు టాటా మోటార్స్ అందించనుంది. దశల వారిగా మొత్తం 25,000 కార్లను డెలివరీ చేయనుంది. మొత్తం డీల్ విలువ ఎంతన్నది రెండు కంపెనీలు వెల్లడించలేదు. టాటా ఎక్స్‌ప్రెస్ట్ ఢిల్లిలో ఎక్స్‌షోరూమ్ ధర 13.04 లక్షలుగా ఉంది. మరో వెర్సన్ ధర 14.98 లక్షలుగా ఉంది. దీనికి ఫ్రేమ్ సబ్సిడీ 2.6 లక్షలు వస్తుంది. ఈ కారు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
దేశంలో స్థిరమైన గ్రీన్ మొబిలిటీని పెంపొందించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా దేశంలోని ప్రముఖ రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఉబర్‌తో భాగస్వామ్యం కావడానికి సంతోషిస్తున్నామని, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ఈవీ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్‌కు మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. దేశంలో గ్రీన్ అండ్ క్లీన్ రైడింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందించేందుకు ఉబర్ కట్టుబడి ఉందని సంస్థ దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభుజీత్ సింగ్ చెప్పారు. కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించే కృష్టిలో టాటా మోటార్స్‌తో కలిసి ఉబర్ భాగస్వామ్యం అవుతుందని ఆయన చెప్పారు. టాటా సిడాన్ ఈవీ ఎక్స్‌ప్రెస్ట్ కారు రెండు వెర్షన్లు ఒక ఛార్జింగ్‌తో 315, 277 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తాయి. ఈ కార్లు 26 కిలోవాట్, 25.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తున్నాయి. జీరో నుంచి 80 శాతం ఛార్జింగ్ చేసేందుకు 110, 59 నిముషాల సమయం తీసుకుంటుంది.