న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో దాదాపు 25శాతం అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ అంశంపై లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బదులిస్తూ ఈ విషయం వెల్లడించారు. నీతి అయోగ్, ప్రపంచ ఆహార కార్యక్రమ నివేదిక ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ సౌకర్యం వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవని వెల్లడైనట్టు ఎంపీ లావు పేర్కొన్నారు. సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 పథకాల కింద.. మెరుగైన పోషకాహార పంపిణీ, బాల్య సంరక్షణ, ఏటా 40,000 అంగన్వాడీలను బలోపేతం చేయడం, మెరుగుపర్చడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుగుణంగా 50 వేల అంగన్‌వాడీ భవనాలను నిర్మించేందుకు నిబంధన ఉందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ఎంపీలకు కేటాయించే స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి , రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ వంటి పథకాల నుండి అంగన్వాడీ భవనాల నిర్మాణానికి నిధులను వినియోగించుకోవాలని కేంద్రం సూచనలు జారీ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేందుకు నిధులు ఇచ్చామని మంత్రి తెలిపారు.