Tuesday, November 26, 2024

ప్రయాణికుల భద్రతకు పెద్దపీట.. వందేభారత్‌ రైలులో కొత్తగా మరో 25 ఫీచర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు భద్రతకు కూడా పెద్ద పీట వేస్తోంది. అందుబాటులోకి వస్తున్న అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో ఈ రైళ్లలో భారీగా మార్పులు చేపట్టనున్నారు. దీంతో వందేభారత్‌ రైళ్లు రానున్న రోజుల్లో మరిన్ని ఫీచర్లతో దూసుకుపోనున్నాయి.

ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా కంఫర్ట్‌, సేఫ్టీ, కన్వీనియన్స్‌పై దృష్టి సారిస్తూ భారతీయ రైల్వే త్వరలో 25 కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. భద్రతపరంగా అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక యంత్రాలను సులువుగా గుర్తించేలా హింగ్డ్‌ ట్రాన్స్‌పరెంట్‌ డోర్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవర్‌ కంట్రోల్‌ పానెల్‌ లోని ఎమర్జెన్సీ స్టాప్‌ పుష్‌ బటన్‌ను ఈజీగా ఉపయోగించే విధంగా ఆప్టిమైజ్‌ చేస్తున్నారు. వీటిని సులభంగా నిర్వహించేందుకు ఎలక్ట్రిక్‌ మెయింటెనెన్స్‌ హాచ్‌ డోర్లను బిగిస్తున్నారు. ఇక రిజర్వేషన్‌ బోగీలలోకి అపరిచిత వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా యాంటీ క్లైంబింగ్‌ డివైజెస్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు.

- Advertisement -

అలాగే, మెరుగైన భద్రత కోసం ఇంప్రూవ్డ్‌ ఫైర్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ను పొందుపరుస్తున్నారు. ఇక ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యం అందించేలా ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టంను అధునీకరిస్తున్నారు. ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌, ఇన్పోటైన్‌మెంట్‌ స్క్రీనలను సులభంగా వీక్షించడానికి మరింత పెద్దవిగా రానున్నాయి. అలాగే, బెటర్‌ విజిబిలిటీ కన్వీనియెన్స్‌ అందించేందుకు టాయిలెట్‌ లైటింగ్‌ను సైతం మెరుగుపర్చడంతో పాటు టాయిలెట్‌ హ్యాండిల్‌ మెరుగైన గ్రిప్‌ అందించేలా రీ డిజైన్‌ చేశారు.

దీంతో ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మరోవైపు, ఏదైనా అనుకోని ప్రమాదం లేదా సంఘటన జరిగినప్పుడు డ్రైవర్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌ యూనిట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల సీట్ల కింద మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్‌లను మరింత ఈజీగా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇక దివ్యాంగుల సౌకర్యార్థం డ్రైవింగ్‌ ట్రైలర్‌ కోచ్‌లలో వీల్‌చైర్‌ ఫిక్సింగ్‌ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్త్తున్నారు.

తొమ్మిదో భారత్‌ గౌరవ్‌ రైలు ప్రారంభం

ద.మ.రైల్వే తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్న తొమ్మిదో భారత్‌ గౌరవ్‌ రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బుధవారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎనిమిది ట్రిప్పులు పూర్తి చేసిన ఈ రైలును తమిళనాడుకు చెందిన చెన్నై వాసి సౌమియా గోపీనాథ్‌ ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు దేశంలోని తూర్పు, ఉత్తర భాగంలోని పురాతన, చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి ఈ రైలు అవకాశం కల్పిస్తుంది. ఈ టూరిస్ట్‌ సర్క్యూట్‌ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం ప్రజలకు సౌకర్యాన్ని కలిగిస్తుంది.

ఈ రైలు 9 రోజుల వ్యవధిలో ఉత్తర భారత దేశంలోని పూరి, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ వంటి దివ్య తీర్థ స్థలాలను కవర్‌ చేస్తుంది. ఈ సందర్భంగా ద.మ.రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా చారిత్రక ప్రదేశాల సందర్శనకు అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement