హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 18న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2427 ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవ క్షేత్రాలకు ఈనెల 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ బస్సులను నడుపనుంది. ప్రధానంగా ఏపీలోని శ్రీశైలానికి 578, వేములవాడకు 481, కీసరగుట్టగకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 57, కొండగట్లుకు 37, ఆలంపూర్‌కు 16తో పాటు రామప్ప, ఉమామహేశ్వరానికి ఈ ప్రత్యేక బస్సులను నడుపనుంది.
ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి విసి సజ్జన్నార్ మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోందనీ, రాష్ట్రంలోని 40 ప్రముఖ శైవాలయాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకుని మొక్కలు చెల్లించుకోవాలని కోరారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్ ఆర్టీసీ కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.