Thursday, November 21, 2024

దేశంలో 24 నకిలీ యూనివర్సిటీలు.. ఈ జాబితాలో ఏపీలోని ఓ యూనివర్సిటీ

దేశంలో 24 యూనివర్సిటీలను న‌కిలీ వ‌ర్సిటీలుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు నకిలీ యూనివర్సిటీలపై యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) ప్ర‌క‌టన చేసింద‌ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తెలిపారు. అటు మ‌రో రెండు యూనివ‌ర్సిటీలు నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ్డాయ‌ని వివ‌రించారు. వ‌ర్సిటీల‌కు సంబంధించిన‌ లోక్‌స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఈ మేర‌కు స‌మాధానం ఇచ్చారు. నకిలీ యూనివర్సిటీల జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ వ‌ర్సిటీ కూడా ఉండటం గమనార్హం.

‘విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ప్ర‌జ‌లు, ఎల‌క్ట్రానిక్, ప్రింట్ మీడియా నుంచి వ‌చ్చిన ఫిర్యాదులను ప‌రిశీలించిన యూజీసీ 24 వ‌ర్సిటీల‌ను న‌కిలీవిగా తేల్చింది. అలాగే, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలోని భార‌తీయ శిక్ష ప‌రిష‌త్, న్యూఢిల్లీలోని కుతుబ్ ఎన్‌క్లేవ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ సంస్థ‌లు యూజీసీ చ‌ట్టం-1956లోని నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు యూజీసీ గుర్తించింది. ఈ రెండు వ‌ర్సిటీల అంశం న్యాయ‌స్థానం ప‌రిధిలో ఉంది’ అని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ చెప్పారు.

న‌కిలీ యూనివ‌ర్సిటీలు అధికంగా ఎనిమిది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఉన్నాయి. వార‌ణాసిలోని వార‌ణ‌సేయ సంస్కృత విశ్వ విద్యాల‌యం, అలహాబాద్‌లోని మ‌హిళా గ్రామ విద్యాపీఠం, గాంధీ హిందీ విద్యాపీఠం, కాన్పూర్ లోని నేష‌నల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ ఎల‌క్ట్రో కాంప్లెక్స్ హోమియోప‌తి, అలీగ‌ఢ్‌లోని నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ఓపెన్ యూనివ‌ర్సిటీ, మ‌థుర‌లోని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ విశ్వ‌విద్యాల‌య‌, నోయిడాలోని ఇంద్ర‌ప్ర‌స్థ శిక్ష ప‌రిష‌త్‌, ప్ర‌తాప్ గ‌ఢ్‌లోని మ‌హారాణా ప్ర‌తాప్ నికేత‌న్ విశ్వ విద్యాల‌యాల‌ను యూజీసీ న‌కిలీ విశ్వ విద్యాల‌యాలుగా ప్ర‌క‌టించింది. ఇక రాజధాని ఢిల్లీలో ఏడు నకిలీ వ‌ర్సిటీలు ఉన్నాయని యూజీసీ తెలిపింది. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ వ‌ర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఎడీఆర్ సెంట్రిక్ వర్సిటీ, ఇండియన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విశ్వకర్మ ఓపెన్ వర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం నకిలీ వ‌ర్సిటీలుగా గుర్తించింది. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో రెండేసి విశ్వవిద్యాలయాలు న‌కిలీవి ఉన్నాయ‌ని యూజీసీ చెప్పింది. కోల్ క‌తాలోని ఇండియన్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, ఒడిశాలోని నవ భారత్ శిక్షా పరిషత్, రూర్కెలా, నార్త్ ఒడిశా వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ నకిలీవ‌ని చెప్పింది.

ఇంకా, పుదుచ్చేరిలోని శ్రీ‌బోధి అకాడ‌మీ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్, నాగ‌పూర్‌లోని రాజా అర‌బిక్ వ‌ర్సిటీ, కేర‌ళ‌లోని సెయింట్ జాన్స్ వ‌ర్సిటీ, క‌ర్ణాట‌క‌లోని బ‌ద‌గ‌న్వీ స‌ర్కార్ వ‌ర‌ల్డ్ ఓపెన్ వ‌ర్సిటీ ఎడ్యుకేష‌న్ సొసైటీ న‌కిలీవ‌ని యూజీసీ తెలిపింది. నకిలీ వ‌ర్సిటీల జాబితాను ఇప్ప‌టికే యూజీసీ ఇంగ్లీష్‌, హిందీ వార్తా పేప‌ర్ల‌లో ప్ర‌చురింప‌జేసేలా చేసి ప్ర‌జ‌ల దృష్టిని తీసుకు వ‌చ్చింద‌ని ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ చెప్పారు. అటువంటి వాటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాల ప్ర‌భుత్వ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, విద్యాశాఖ కార్య‌ద‌ర్శులు, ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీల‌కు లేఖ‌లు రాసింద‌ని చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి: బిల్‌గేట్స్ దంపతులకు విడాకులు మంజూరు

Advertisement

తాజా వార్తలు

Advertisement