ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24.09 శాతం పెరిగి 15.67 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ శనివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రిఫండ్స్ ఇచ్చిన తరువాత ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 18.40 శాతం పెరిగి 12.98 లక్షల కోట్లుగా ఉన్నాయని తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల అంచనాలో ఇది 79 శాతమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లను ప్రభుత్వం సవరించింది. బడ్జెట్ అంచనా ప్రకారం ఇది 14.20 లక్షల కోట్లు, దీన్ని ప్రభుత్వం సవరించి 16.50 లక్షల కోట్లుగా మార్చింది. సవరించిన అంచానల్లో ప్రస్తుతం వసూలైంది 79 శాతమని సీబీడీటీ తెలిపింది. ఫిబ్రవరి 10 వరకు వసూలైన మొత్తం ఇదని, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో నెలనెలా వృద్ధి నమోదవుతునే ఉందని పేర్కొంది. ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17 శాతం పెరుగుతాయని అంచనా వేసినట్లు బోర్డు తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఇవి 14.08 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు కార్పొరేట్ పన్ను 19.33 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్ను 29.63 శాతం వృద్ధి నమోదు చేశాయి. రిఫండ్స్ తరువాత కార్పొరేట్ పన్నుల్లో 15.84 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో 21.23 శాతం పెరుగుదల ఉందని సీబీడీటీ తెలిపింది. ఫిబ్రవరి 10 వరకు 2.69 లక్షల కోట్లు రిఫండ్ చేసినట్లు తెలిపింది. ఇది గతంలో కంటే 61.58 శాతం ఎక్కువ.