Saturday, November 16, 2024

23నే దసరా.. వేద పండిత సభ తీర్మానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : గత కొన్నేళ్లుగా హిందూ పండగ విషయాల్లో కొన్ని ధర్మ సందేహాలు నెలకొంటు-న్నాయి. ఏ పండగ ఎప్పుడు చేసుకోవాలన్న అంశంపై పండితులు కూడా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది పలు పండగ తేదీలపైనా ఇలాంటి సందేహాలే వ్యక్తమయ్యాయి.

తాజాగా రాఖీ పౌర్ణమి విషయంలో పండితులు కూడా స్పష్టత ఇవ్వలేకపోయారు. వినాయక చవితి పండగ సమయంలో ఇదే అయోమయం ఏర్పడింది. సమీపంలో ఉన్న విజయ దశమి (దసరా) పండగ విషయంలో ఇదే సందిగ్దత నెలకొంది. కొంత మంది ఈ నెల 23న అంటే.. మరికొందరు మాత్రం ఈ నెల 24న పండగ అంటున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో దసరా పండగ అనేది అక్టోబర్‌ 23 సోమవారమా..? లేకపోతే అక్టోబర్‌ 24 మంగళవారమా..? అనే విషయమై వేద పండిత సభ స్పష్టత ఇచ్చింది. వేద పండితులు ఒక వేదికపై కలిసి చర్చించి అక్టోబర్‌ 23న తేది సోమవారం దసరా పండగను నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.

సోమవారం మధ్యాహ్నం నుండి దశమి తిథితో పాటు శ్రవణ నక్షత్రం సోమవారమే ఉండటంతో 23వ తేదినే దసరా పండగను నిర్వహించుకోవాలన్నారు. అదే రోజు సాయంత్రం శమీ దర్శనం చేసుకోవాలని ప్రజలును కోరారు. పండితులు చేసిన ఈ నిర్ణయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విషయంలో ఎంతో మంది ఎన్నో సందేహాలున్నాయి. దశమి రోజున సాయంత్రం శ్రవణ నక్షత్రం ప్రామాణికం. కానీ ఈ సారి విజయ దశమి అక్టోబర్‌ 24న రోజున.. శ్రవణ నక్షత్రం లేదు. ధనిష్ట ఉంది. అటు 23 సాయంత్రం దసరా, శ్రవణ నక్షత్రం ఉంది. దాన్నే పండితులు ప్రామాణికంగా తీసుకున్నారు.

అటు దీపావళి పండగకు కూడా బహుళ చతుర్ధశి, అర్దరాత్రి అమావాస్య ప్రామాణికం. ఈ సారి నవంబర్‌ 12 ఆదివారం చతుర్ధశి మధ్యాహ్నం 1.53 నిమిషాల వరకు ఉంది. రాత్రి అమావాస్య కాబట్టి అదే రోజు దీపావళి. ఈ సారి మహాశివరాత్రి పండగ మార్చి 8న ప్రామాణికం.

అటు ఉగాదికి ఉదయం రోజు పాడ్యమినీ, ఆ రోజునే ఉగాది పండగను జరుపుకోవాలని ధర్మ సింధువు చెబుతోంది. అదే అంశాన్ని నిర్ణయ సింధువు కూడా ఘోషిస్తోంది. మొత్తంగా ఒక్కో పండగకు తిథి అనేది ఒక్కో రకంగా ప్రామాణికంగా వస్తూ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement