Saturday, November 23, 2024

ఆయుష్మాన్ భారత్ కింద తెలంగాణకు 236 కోట్లు.. ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆయుష్మాన్ భారత్ కింద తెలంగాణకు ఇప్పటివరకు రూ.236.05 కోట్లను తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయుష్మాన్ భారత్ – పీఎం జన్ ఆరోగ్య యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి నిధుల విడుదలపై బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి డా.భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం సమాధానమిచ్చారు. ఆయుష్మాన్ భారత్ కింద 7.09 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరగా… అందుకోసం రూ. 2,012 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ఇప్పటివరకు 41,98,258 మందికి ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డులు ఉన్నాయని, ఇందులో 7,09,497 మంది ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆస్పత్రుల్లో చేరారని వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 746 ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్ పథకంలో కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. తెలంగాణలో పీఎంజేఏవై పథకానికి 29,02,621 కుటుంబాలు అర్హత కలిగి ఉన్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద పథకమని,  ఒక కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు చికిత్స పొందే అవకాశం ఉందని వివరించారు.

దేశవ్యాప్తంగా 26,434 ఆస్పత్రులు ఈ పథకంలో ఉండగా, అందులో 11,500 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయని ఆమె చెప్పారు. దేశవ్యాప్తంగా 2023 మార్చి 20 వరకు 23.3 కోట్ల లబ్ధిదారులు ఈ పథకం కింద పరీక్షలు చేసుకోగా, 4.49 కోట్ల మంది ఆస్పత్రుల్లో చేరారని ఇందుకుగాను రూ.54,224 కోట్ల ఖర్చు అయ్యిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement