Friday, November 22, 2024

Kolkata : 23వేల 753 మంది ఉద్యోగాలు రద్దు… హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

మ‌మ‌తా స‌ర్కార్ కు షాక్
గ్రూప్‌- సీ, గ్రూప్‌- డీలో స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌
చేసిన నియామకాలు చెల్ల‌వ‌న్న న్యాయ‌స్థానం
2016 నుంచి ఆ ఉద్యోగులు తీసుకున్న జీతాల‌ను
12 శాతం వ‌డ్డీతో నాలుగు వారాల‌లో చెల్లించాల‌ని ఆదేశం

కోల్ క‌తా – పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఈరోజు పెద్ద షాక్ తగిలింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంపై నేడు తీర్పు వెలువరిస్తూ కోల్ క‌తా హైకోర్టు డివిజన్ బెంచ్ 2016 నాటి మొత్తం ప్యానెల్‌ను రద్దు చేయాలని ఆదేశించింది. 9, 10, 11, 12వ తరగతిలో గ్రూప్‌- సీ, గ్రూప్‌- డీలో స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ చేసిన నియామకాలన్నీ చట్టవిరుద్ధమని తెలిపింది. దీని ద్వారా ఎంపికైన 23 వేల 753 మంది ఉద్యోగాలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుంగా ఇప్ప‌టి వ‌ర‌కూ వారు తీసుకున్న జీతం నాలుగు వారాల్లోగా 12 శాతం వడ్డీతో క‌లిపి తిరిగి ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

అలాగే, దీంతో పాటు జీరో పోస్టులపై కొత్త నియామకాలు ప్రారంభించాలని స్కూల్ సర్వీస్ కమిషన్‌ను కోల్ క‌తా హైకోర్టు ఆదేశించింది. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగించ‌వ‌చ్చ‌ని, ఈ కేసులో ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. 23లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రానున్న 15 రోజుల్లో కొత్త నియామకాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు అధికార యంత్రాంగానికి తెలిపింది.

తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాం …. మమతా బెనర్జీ

 పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఉద్యోగాలను రద్దు చేయడంతో పాటు.. వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు. ఈసందర్భంగా కోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడారు. ”ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేవరకు పోరాడతాం. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తాం. ఉద్యోగాలు కోల్పోయిన వారు అధైర్యపడొద్దు” అని మమత అన్నారు. పైగా 8 ఏళ్ల వేతనాన్ని కేవలం 4 వారాల గడువులో చెల్లించడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. కొందరు భాజపా నేతలు న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారంటూ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement