మన దేశంలో నడిచే మొత్తం టూ వీలర్స్, త్రీ వీలర్స్ స్థానంలో విద్యుత్ వాహనాలు సమకూర్చుకోవాలంటే 23 లక్షల కోట్ల నిదులు అవసరం అవుతాయని నీతి ఆయోగ్, ప్రపంచ ఆర్ధిక వేదిక(డబ్ల్యూ ఈఎఫ్) రూపొందించిన నివేదిక అంచనా వేసింది. ఈ విషయంలో పట్టణాల్లో సరకు రవాణా చేసే త్రీ చక్ర వాహనాలు ముందున్నాయని నివేదిక తెలిపింది. విద్యుత్ వాహనాల ధరలు అధికంగా ఉండటం, కొత్త టెక్నాలజీపై నమ్మకం కుదరకపోవడం, తిరిగి అమ్మాలంటే ఎంత వస్తుందన్న దానిపై స్పష్టత లేకపోవడం వంటి కారణాల వల్ల వ్యక్తిత అవసరాల కోసం కొనాలనుకునే వారు వెనుకాడుతున్నారని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం మొత్తం వాహన విక్రయాల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా 80 శాతానికి పైగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ వాహనాల అమ్మకాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
వృద్ధికి మంచి అవకాశాలు
ప్రస్తుతం దేశంలో విద్యుత్ ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకుర సంబంధించి 45 సర్టిఫైడ్ తయారీ సంస్థలు ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లో ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా వాహనాల అమ్మకాలు జరిగాయి. దేశంలో మొత్తం ద్వి చక్ర, త్రి చక్ర వాహనాలు 25 కోట్ల వరకు ఉంటాయని అంచనా. వీటితో పోల్చితే ప్రస్తుతం విద్యుత్ వాహనాల సంఖ్య చాలా స్వల్పంగా ఉన్నాయి. కస్టమర్లకు వీటిపై నమ్మకం పెరిగితే, ధరలు అనుకూలంగా వుంటే వీటి అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా వినియోగదారులు, నాణ్యత, ధర, ఒక ఛార్జింగ్‌కు ఎంత దూరం ప్రయాణించవచ్చన్న అంశాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటున్నారు. వీటి విషయంలో వారికి నమ్మకం ఏర్పడితే వీటి అమ్మకాలు వేగంగా వృద్ధి చెందుతాయి. దేశంలో వంద శాతం ద్వి చక్ర, త్రి చక్ర వాహనాల్నీ ఎలక్ట్రిక్‌గా మారేందుకు 23 లక్షల కోట్లు ఎందుకు అవసరం అవుతాయో కూడా ఈ నివేదికలో వివరించారు.
ఖర్చుపై అంచనా..
ప్రస్తుతం మన దేశంలో పెరుగుతున్న ప్రజల ఆదాయాలు, వాహన యజమానుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ద్వి , త్రి చక్ర వాహనాల సంఖ్య 27 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ ద్విచక్ర వాహనానికి సగటున 81 వేల వరకు, త్రి చక్ర వాహనానికి 2.8 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ లెక్కన 26.4 కోట్ల ద్విచక్ర వాహనాలు, 60 లక్షల త్రి చక్ర వాహనాల కొనుగోలుకు 23 లక్షల కోట్లవుతుందని నివేదిక వివరించింది. వీటితో పాటు ఇతర మౌలిక సదుపాయాల కోసం చేసే ఖర్చు దీనికి అదనమని పేర్కొంది. విద్యుత్ వాహనాల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి నిర్వాహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రెంటల్ కార్లు, సరకు రవాణా కోసం పని చేసే సంస్థలు ప్రధానంగా విద్యుత్ వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా నగరాల్లో విద్యుత్ సరకు రవాణా ఆటోలు అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి.
విద్యుత్ వాహన రంగంలోఓ పెట్టుబడులు ఆకర్షించేందుకు దీర్ఘకాలిక విధానం, మార్గదర్శకాలు అవసరమని నివేదిక తెలిపింది. పరిశ్రమకు, పెట్టుబడులు పెట్టే వారికి మధ్య మరింత సహకారం ఇందుకు కావాల్సి ఉందని తెలిపింది. విద్యుత్ వాహనాలకు మారేందుకు ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇవ్వాలని నివేదిక కోరింది. పెట్టుబడులు ఆకర్షించేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక కూడా అవసరమని పేర్కొంది.