చీలీ అడవుల్లో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చింది. దావానలం డజన్ల కొద్ది మంటలతో విస్తరించింది. ఈ అగ్నికీలలకు ఇప్పటి వరకు 23 మంది ఆహుతయ్యారు. 979 మంది గాయపడ్డారు. 1100 మందికిపైగా నిరాశ్రయులయ్యారు. మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అరౌకానియాలోని దక్షిణప్రాంతానికి ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. మొత్తం 231 మంటల్లో 80 అగ్నికీలలు చురుగ్గా ఉన్నాయి.
మిగతా వాటిలో 151 మంటల్ని నియంత్రించగలిగామని, బయోబియో, న్యూబుల్ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మరింత అధ్నాన్నంగా ఉన్నాయని హోంమంత్రి కరోలినా తోహా విలేకరుల సమావేశంలో చెప్పారు. దక్షిణార్ధగోళంలో వేసవి ఉష్ణోగ్రతలు 104డిగ్రీల ఫారన్‌హీట్ కంటే అధికంగా ఉండటం వల్ల కార్చిచ్చు ప్రమాదాలు తలెత్తుతున్నాయని అధికారులు తెవిపారు. శనివారం ఒక్కరోజే కొత్తగా 16చోట్ల మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీఆంక్షలు విధించిన ప్రాంతాల్లో ఖరీదైన ద్రాక్ష, ఆపిల్, బెర్రీ పంట క్షేత్రాలు, విస్తారమైన అటవీ భూములు ఉన్నాయి.
మంటలను ఆర్పేందుకు స్పెయిన్, అమెరికా, అర్జెంటీనా, ఈక్వెడార్, వెనిజులా విమానాలు రంగంలోకి దిగాయని అధికారులు తెలిపారు. ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు సైనికులు, పోలీసులు, ఫైర్‌సిబ్బందిని వినియోగిస్తున్నారు. దాదాపు 40 వేల హెక్టార్లలో అడవులు బుగ్గి అయ్యాయి. శాంటియాగోకు దక్షిణంగా 310 మైళ్ల దూరంలో ఉన్న బయోబియోలోని శాంటా జువానా పట్టణంలో ఉన్న 11 మంది బాధుతుల్లో సగంమంది మరణించారు.