Tuesday, November 26, 2024

Delhi | గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలో 22 దేశాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బయోఫ్యూయల్స్ (జీవ ఇంధనాలు) వినియోగం, అభివృద్ధిని వేగవంతం చేసే ప్రక్రియలో ప్రపంచ దేశాల సహకారాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ చొరవతో ఏర్పడ్డ “గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమి”లో చేరిన దేశాల సంఖ్య 22కు పెరిగిందని కేంద్రం తెలిపింది. అలాగే 12 అంతర్జాతీయ సంస్థలు ఈ కూటమిలో సభ్యత్వం పొందినట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ పేర్కొన్నారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన జీ 20 సమ్మిట్లో 19 దేశాలు, 12 అంతర్జాతీయ సంస్థల సహకారంతో గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిని ప్రారంభించినట్లు తెలిపారు.

కూటమి ప్రారంభించినప్పటి నుంచి సభ్యత్వ దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వెల్లడించారు. స్టేక్‌హోల్డర్స్ విస్తృత భాగస్వామ్యంతో బయోఫ్యూయల్స్‌కు సంబంధించి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సన్నాహాలను సులభతరం చేయడం,  జాతీయ కార్యక్రమాలు, పాలసీ-పాఠాలు పంచుకోవడానికి సాంకేతిక సహాయం అందించడం, సాంకేతికత పురోగతి, స్థిరమైన జీవ ఇంధనాల వాడకాన్ని విస్తృతం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా జీవ ఇంధన వాడకాన్ని వేగవంతం చేయాలని గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ భావిస్తోందని మంత్రి వివరించారు.

- Advertisement -

అలాగే బయోఫ్యూయల్స్ నైపుణ్య కేంద్రంగా విజ్ఞానాన్ని అందించేందుకు జీబీఏ (గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్) కేంద్ర బిందువుగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ చొరవతో ప్రారంభమైన జీబీఏను ముందుకు తీసుకెళ్లేందుకు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం ఫర్ ప్రాస్పరిటీ (ఐపీఈఎఫ్) మలేషియా రౌండ్‌లో ఇండియా బయోఫ్యూయల్‌ కోపరేటివ్ వర్క్ ప్రోగ్రాంను ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు.

ఆసక్తి కలిగిన ఐపీఈఎఫ్ సభ్యులను ప్రోత్సహించడం, జీవ ఇంధన ఉత్పత్తికి సంబంధించి అత్యంత సమర్థవంతమైన పద్ధతులు అభివృద్ధి చేయడం, బయోఫ్యూయల్ వర్తకంలో సప్లైచైన్స్‌ను గుర్తించడం, ప్రాంతీయ ఫీడ్ స్టాక్ ఏర్పాటు, కోపరేటివ్ వర్క్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఐపీఈఎఫ్ దేశాల నుండి వనరులు, నైపుణ్యాలను సమీకరించడం ద్వారా  జీవ ఇంధన రంగంలో స్థిరమైన, వినూత్నమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడం సిడబ్య్లూపి (కోలేబోరేటివ్ వర్క్ ప్రోగ్రాం) ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. దీనికి అందనంగా  జాయింట్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్, పైలట్ ప్రాజెక్ట్‌లు, నాలెడ్జ్ షేరింగ్, కెపాసిటీ బిల్డింగ్‌ ద్వారా క్లీన్ ఎనర్జీ రంగంలో కోలాబోరేటివ్ వెంచర్స్ ద్వారా సాంకేతిక బదిలీలో ఇండియా విజేతగా నిలుస్తోందని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement