హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణమే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 21 ఏళ్ల ప్రస్థానానికి ఘనమైన ముగింపు లభించింది. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ ఆ లక్ష్యాన్ని ముద్దాడి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లే దేశాన్నీ అభివృద్ధి చేసేందుకు భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారిపోయింది. టీఆర్ఎస్ పేరుతో రాష్ట్ర రాజకీయాల్లో 21ఏళ్ల ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ …ఇప్పుడు బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)పేరుతో జాతీయ రాజకీయాల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ముందుకు వె ళుతున్నారు. 21ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, తిరుగులేని విజయాలు ఆ పార్టీ ఖాతాలో ఉన్నాయి.
రాజకీయాల్లో 21ఏళ్ల అనుభవంతోపాటు 60లక్షల మంది సుశిక్షితులైన సైనికులతో కలిసి దేశ తలరాతను మార్చేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ” తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకున్నామో… అదేవిధంగా దేశాన్ని బాగుచేసుకునేందుకు కదులుదాం.” అని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మిన కేసీఆర్ ఆ మేరకు దాదాపు 13ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారు. చివరకు తాను అనుకున్న పంథాలోనే అహింసాయుత ఉద్యమం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ స్థాపించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్‌తో 2004 ఎన్నికల్లో, టీడీపీతో 2009 ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని టీఆర్ఎస్ పోటీ చేసింది.
ప్రత్యేక రాష్ట్రం కోసం పలుమార్లు పదవులను లెక్కచేయకుండా కేసీఆర్‌తోపాటు ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత 2009లో సీఎం కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడంతో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యాన్ని సీఎం కేసీఆర్ విజయవంతంగా పూర్తి చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్…కొత్త రాష్ట్రానికి తొలి సీఎంగా రాష్ట్ర పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.
2014 మొదలు ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తూ వ చ్చింది. 2014, 2018 ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించేలా చేసిన కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో ప్రవేశపెట్టారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు, ఎకరాకు 5వేల చొప్పున రెండు పంట పెట్టుబడుల సాయంతో రైతు బంధు, రైతు బీమా, దళిత, గిరిజన బంధు, టీఎస్ బీపాస్, కల్యాణ్ లక్ష్మీ, షాదీ ముబారక్ తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
తెలంగాణలో కోటి ఎకరాల మాగాణే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. కాళేశ్వరం పేరిట ప్రపంచంలోనే అతిపెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో మూడేళ్లలోనే పూర్తి చేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీ య వంటి ప్రాజెక్టులనూ పూర్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణ గణనీయమైన విస్థీర్ణంలో పంటలు సాగవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, నూతన సాగు చట్టాలను సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంలో కేంద్రంతో మొదలైన పోరు అనేక విషయాల్లో కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నేరుగా తలపడేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ప్రధానంగా రైతు ఎజెండా, దేశ వ్యాప్తంగా రైతుబంధు అమలు, సాగునీటి సమర్థ వినియోగం లక్ష్యంగా బీఆర్ఎస్ను స్థాపించారు. రైతు బంధు, రైతు బీమా , దళిత, గిరిజన బంధు తదితర పథాకలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటిస్తున్నారు. దేశ రాజకీయాల్లో ప్రభల శక్తులైన అటు కాంగ్రెస్తోగాని ఇటు బీజేపీతోగాని సంబంధం లేకుండానే బీఆర్ఎస్ను ముందుకు నడిపించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ” అబ్కీ బార్ కిసాన్‌కి సర్కార్” నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారు.