Friday, November 22, 2024

దేశంలో కొత్తగా 21 అణు విద్యుత్ కేంద్రాలు.. విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో మొత్తం 21 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు పీఎంవో మంత్రిత్వశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. కార్బన్ ఉద్గారాలను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలలో భాగంగా 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సమకూర్చుకుంటుందని గ్లాస్కోలో జరిగిన కాప్26 సదస్సులో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. తద్వారా దేశ ఇంధన అవసరాలలో 50 శాతం మేర పునరుత్పాదక ఇంధనం ద్వారా పొందేలా అణు విద్యుత్ ఉత్పాదనపై దృష్టి సారించినట్లు  తెలిపారు.

దేశంలో నెలకొల్పుతున్న అణు రియాక్టర్లలో 8700 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన 11 రియాక్టర్లలో కొన్ని ఇప్పటికే ప్రారంభ అయ్యాయని, మరికొన్ని వివిధ దశల్లో  నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇవికాకుండా 700 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మరో 10 అణు రియాక్టర్ల స్థాపనకు ప్రభుత్వం ఆర్థిక, పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్లుల్లో పనులు చురుగ్గా సాగుతుండగా కొన్ని చోట్ల పలు కారణాల వలన పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. అణు రియాక్టర్ల ఏర్పాటుకు అవసరమైన కీలక పరికరాల సరఫరాలో అవాంతరాలు, ఆర్థిక సమస్యలు, ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతతోపాటు కోవిడ్ మహమ్మారి వంటి కారణాల వలన రియాక్టర్ల నిర్మాణంలో జాప్యం చోటుచేసుకున్నట్లు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement