Tuesday, November 19, 2024

మహిళలతో మాత్రమే 2024 రిపబ్లిక్‌ డే పెరెడ్‌.. త్రివిధ దళాలకు రక్షణ శాఖ లేఖ

అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించే దిశగా 2024 సంవత్సరంలో కర్తవ్యపథ్‌ వద్ద జరిగే రిపబ్లిక్‌ డే వేడుకల్లో కేవలం మహిళలతో మాత్రమే కవాతులు, మిలటరీ బ్యాండ్లు, వేర్వేరు రాష్ట్రాలు, శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన, ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాయుధ బలగాలకు, పెరేడ్‌కు సంబంధించిన ప్రభుత్వ శాఖలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక లేఖ రాసింది. మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమనే అధ్యక్షతన ఫిబ్రవరి ఏడవ తేదీన జరిగిన ఒక సమావేశంలో పెరేడ్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.

సైన్యం, నావికా దళం, వైమానిక దళం, కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ, కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ, విద్యా శాఖకు చెందిన ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఇదే విషయాన్ని తెలుపుతూ పెరేడ్‌లో పాల్గొనే బలగాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు మార్చి ఒకటవ తేదీన రక్షణ మంత్రిత్వ శాఖ ఒక లేఖను రాసింది. వచ్చే ఏడాది జరిగే రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో మహిళల పాత్ర ప్రధానంగా ఉండాలని సదరు లేఖలో నొక్కి వక్కాణించింది. ఆ దిశగా ఇప్పటి నుంచే సన్నాహకాలను ప్రారంభించాలని, పురోగతిని ఎప్పటికప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement