Saturday, September 21, 2024

Big story | 2000 నోటు ఇక కనుమరుగు.. నేటితో ముగియనున్న చలామణి

(న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) : దేశంలో చలామణిలో ఉన్న అత్యధిక మారకపు విలువగల పింక్‌ నోట్‌కు శనివారంతో కాలం చెల్లిపోతోంది. రూ.2 వేల మారకపు విలువ కలిగిన ఈ నోటును ప్రవేశపెడుతున్నట్లు 2016 నవంబర్‌ 8న ప్రభుత్వం ప్రకటించింది. రెండ్రోజుల కాలవ్యవధిలో నవంబర్‌ 10 నుంచి ఈ నోట్లు చలామణిలోకి వచ్చాయి. కాగా 2019మార్చి వరకు వీటిని రిజర్వ్‌బ్యాంక్‌ ముద్రించింది. ఆ తర్వాత ముద్రణ ఆపేసింది. ఈ ఏడాది మే 20నాడు ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటించింది. చలామణిలో ఉన్న నోట్లన్నీ తిరిగి బ్యాంక్‌కు చేరవేసేందుకు సెప్టెంబర్‌ 30వరకు గడువిచ్చింది.

2016 నవంబర్‌ 8నాటికి దేశంలో గరిష్ట మారకపు విలువ గలిగిన నోటుగా వెయ్యి రూపాయల కరెన్సీ ఉండేది. అయితే ఇది ఎక్కువగా నల్లధన మదుపరుల వద్ద పోగుబడింది. అలాగే ఉగ్రవాదులు, అసాంఘిక కార్యకలాపాల నిర్వహణలో ఈ నోట్లే ఎక్కువగా చలామణి అవుతున్నట్లు కేంద్రం గుర్తించింది. పాకిస్థాన్‌ కేంద్రంగా నకిలీ నోట్ల ముద్రణదార్లు కూడా వెయ్యి రూపాయల నోట్ల తయారీపైనే ఎక్కువ దృష్ట పెట్టినట్లు స్పష్టమైంది. దీంతో చలాణిలో ఉన్న 1000, 500రూపాయల నోట్లను కేంద్రం అకస్మాత్తుగా నిలిపేసింది.

అదే సమయంలో కొత్త ఫీచర్స్‌తో రూ.500 నోట్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు అధిక మారకపు విలువ కలిగిన రూ.2 వేల నోట్లను కూడా చలామణిలోకి తెచ్చింది. కాగా ఇప్పుడు చరిత్ర పునరావృతమైంది. 1996కి ముందు నల్లధన మదుపరులు, ఉగ్రవాదచర్యలు, అసాంఘిక కార్యకలాపాల నిర్వాహకులకు ఆసరాగా ఉన్న వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తే ఆ స్థానంలో వచ్చిన 2 వేల రూపాయల నోట్లను వీరు వినియోగించుకోవడం మొదలెట్టారు. రిజర్వ్‌బ్యాంక్‌ ముద్రించిన నోట్లలో 70శాతానికి పైగా మార్కెట్లో చలామణిలోకి రావడంలేదు.

- Advertisement -

ఇవన్నీ నల్లధనం మదుపరుల బీరువా అరల్లోకి చేరిపోయాయి. దీన్ని గుర్తించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ నోటు రద్దుకు నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్‌లో ఈ 2వేల నోటును ప్రజలకు పరిచయం చేశారు. రిజర్వ్‌బ్యాంక్‌ ముద్రించిన ఈ నోట్లలో 89శాతం 2017 మార్చిలోగా ముద్రించినవే. వెనువెంటనే ఇవి గరిష్ట స్థాయిలో మార్కెట్లోకొచ్చేశాయి. 2017 మార్చి 31నాటికి రూ.6.73 లక్షల కోట్ల విలువ కలిగిన రూ.2 వేల నోట్లు భారత మార్కెట్‌ను ఆక్రమించాయి. అయితే ఏడాది తిరిగేసరికి 2018మార్చి 31నాటికి మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ 3.62లక్షల కోట్లకు పరిమితమైంది.

దీంతో 2018 ఏప్రిల్‌ నుంచి ఈ 2 వేల రూపాయల నోటు ముద్రణను రిజర్వ్‌బ్యాంక్‌ నిలిపేసింది. అంచెలంచెలుగా చెలామణిలో ఉన్న నోట్ల సంఖ్య తగ్గుతోంది. ఈ ఏడాది మే 19నాటికి 3.5లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో అధిక మారకపు విలువ కలిగిన నోట్లు తిరిగి ఉగ్రవాదులకు, అసాంఘిక శక్తులకు పెద్దెత్తున చేరుతున్న విషయాన్ని ఆర్‌బీఐ ధ్రువీకరించుకుంది. వెంటనే వీటి ఉపసంహరణకు నిర్ణయించింది. అయితే 2016నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ నోట్ల ఉపసంహరణకు తగినంత గడువిచ్చింది. ఈ గడువు కూడా శనివారంతో ముగుస్తోంది.

క్లీన్‌ నోట్‌ పాలసీ

అయితే ఈ నోట్ల ఉపసంహణకు క్లీన్‌ నోట్‌ పాలసీయే కారణంగా రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటించింది. అసలు క్లీన్‌నోట్‌ పాలసీ అంటే ఏంటి? ఎప్పటికప్పుడు నాణేలు, కరెన్సీ నోట్లలో భద్రతా ప్రమాణాలు పెంచేందుకు రిజర్వ్‌బ్యాంక్‌ ప్రయత్నిస్తోంది. 2005కి ముందు ముద్రించిన నోట్లతో పోలిస్తే ఆ తర్వాత ముద్రించిన నోట్లలో సెక్యూరిటీ ఫీచర్లు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా 2005కి ముందునాటి నోట్లు బ్యాంకులకొస్తే తిరిగి వాటిని చెలామణిలోకి పంపించరు. ఇలా వచ్చిన నోట్లన్నింటిని వివిధ బ్యాంకుల శాఖల నుంచి రిజర్వ్‌బ్యాంక్‌ సమీకరిస్తుంది. వీటిని పూర్తిగా ధ్వంసం చేస్తుంది.

వాటి విలువ మేరకు కొత్తనోట్లను ముద్రించి చెలామణిలోకి తెస్తుంది. ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన, మెరుగైన భద్రతా ప్రమాణాలు గల నోట్లను అందించాలన్న రిజర్వ్‌బ్యాంక్‌ లక్ష్యాలకనుగుణంగా ఈ క్లీన్‌ నోట్‌ పాలసీని రూపొందించారు. అయితే 2016 నవంబర్‌లో ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 24(1) ప్రకారం జారీ చేసిన రూ.2 వేల నోట్లను కనీసం ఎనిమిదేళ్ళు పూర్తికాకముందే రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించుకుంటోంది. ఇందుకు ఆర్‌బీఐ పలు కారణాల్ని చెబుతోంది. 2018-19లో 2 వేల నోట్ల ముద్రణను నిలిపేసే నాటికి ఇతర మారకపు విలువ కలిగిన నోట్లు తగిన పరిమాణంలో మార్కెట్లో అందుబాటులోకొచ్చాయని రిజర్వ్‌బ్యాంక్‌ పేర్కొంది.

అలాగే ఈ 2 వేల నోట్లను నాలుగు నుంచి ఐదేళ్ళ పాటు చలామణి అయ్యే స్థాయిలోనే నాణ్యతా ప్రమాణాలు వినియోగించినట్లు ఆర్‌బీఐ చెబుతోంది. ఇప్పటికే ఈ నోట్లు మార్కెట్లోకొచ్చి ఏడేళ్ళు పూర్తయినందున ఇవి నలిగి చినిగిపోతున్నాయని స్పష్టం చేస్తోంది. అయితే ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం సెప్టెంబర్‌ 30 తర్వాత కూడా ఈ నోట్లు మారకపు విలువ కలిగుంటాయా లేదా అన్నది రిజర్వ్‌బ్యాంక్‌ తేల్చిచెప్పలేదు.

అలాగే కేవలం నాలుగైదేళ్ల జీవితకాలం కలిగిన నోట్లను విడుదల చేయాల్సి రావడానికి కారణాల్ని కూడా ఎక్కడా వివరించలేదు. కాగా ఈ 2వేల రూపాయల నోటులో చిప్‌ ఉంచారంటూ తొలుత ప్రచారం జరిగింది. వీటిని ఎక్కడ అక్రమంగా పెద్దసంఖ్యలో మదుపు చేసినా ఆ వివరాలు రిజర్వ్‌బ్యాంక్‌ అధికారులకు సునాయాశంగా తెలిసిపోతుందన్న వార్తలొచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ వీటిని ధ్రువీకరించలేదు. అలాగే పరిశోధించిన నిపుణులు కూడా చిప్‌లు అమర్చిన దాఖలాల్లేవని తేల్చేశారు.

మార్కెట్లో పెరిగిన నగదు విలువ

భారత్‌లో నగదు రహిత లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. కిరాణా దుకాణాల నుంచి బజ్జీలు, మొక్కజొన్న పొత్తుల దుకాణాల వరకు ఆన్‌లైన్‌ పేమెంట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో నగదు లావాదేవీలు కూడా జోరందుకున్నాయి. 2016నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు నాటికి మార్కెట్లో రూ.18 లక్షల కోట్ల విలువైన నోట్లుంటే ఇప్పుడు రూ.32.5లక్షల కోట్ల విలువైన నోట్లు మార్కెట్లో ఉన్నాయి.

2017మార్చి 31నాటికి 9.512లక్షల కోట్ల విలువైన రూ.500ల నోట్లుంటే 2023మార్చి నాటికి 14.54లక్షల కోట్ల విలువైన ఐదొందల నోట్లు మార్కెట్లోకొచ్చేశాయి. మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో 34.9శాతం రూ.500 నోట్లు కాగా 21.3శాతం రూ.10ల నోట్లున్నాయి. ఓ వైపు నగదు రహిత లావాదేవీలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అంతకుమించి వేగంతో నగదు లావాదేవీలు కూడా జరుగుతున్నాయి. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోవడానికి ఇది కూడా ఓ కారణం.

రూ.1190 కోట్లు నష్టం

ఇంతవరకు రిజర్వ్‌బ్యాంక్‌ 336.3కోట్ల రూ.2 వేల నోట్లను ముద్రించింది. ఇందుకోసం 1190 కోట్లు ఖర్చయింది. వీటిని ఉపసంహరించుకోవడంతో ఈ మేరకు ప్రజాధనం వృధా అయినట్లే. అంతకుముందు వెయ్యి రూపాయల నోట్లు ముద్రించేందుకు రూ.3.54లు ఖర్చయ్యేది.

కాగా 2వేల రూపాయల నోటు ప్రింటింగ్‌ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.4.18లను ఖర్చు చేసింది. అంటే వెయ్యి రూపాయల నోటుకంటే 2వేల నోటు ముద్రణకు 64పైసలు ఎక్కువ వ్యయమైంది. కాగా 50రూపాయల నోటుకు రూ.1.01, 20రూపాయ నోటుకు 1రూపాయి, 10రూపాయల నోటుకు రూ.1.01లు ఖర్చవుతున్నాయి.

కరెన్సీపై తగ్గుతున్న విశ్వాసం

ఏడేళ్ళ క్రితం అకస్మాత్తుగా రాత్రికి రాత్రే రూ.500, రూ.1000ల నోట్లను కేంద్రం రద్దు చేసింది. కాగా ఇప్పుడు రూ.2 వేల నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించింది. దీంతో ఇప్పుడున్న రూ.500 నోట్లను కూడా రద్దు చేస్తారా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. ఈ చర్యలు భారతీయ ప్రధాన మారకమైన నోట్లపై ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచుతున్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది. అసంఘటిత రంగం దెబ్బతింది. నోట్ల ఉపసంహరణతో ఈ రంగం మరింత దిగజారే ప్రమాదముంది. భారత్‌లో ఇప్పటికే లావాదేవీల కోసం అత్యధికులు నోట్లనే వినియోగిస్తున్నారు. ఈ నోట్లపై విశ్వాసం సన్నగిల్లితే ఆర్థిక లావాదేవీలు తగ్గుతాయి. ఇవి ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రమాదముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement