Sunday, June 30, 2024

TS | వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య.. ఎందుకీ దుస్థితి : కేసీఆర్

దేశంలోనే నంబర్ వన్ గా ఉన్న తెలంగాణకు తక్కువ కాలంలోనే ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన అనంతరం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పాత రోజులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నీరు, కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు. రైతుల కష్టాలు చూస్తుంటే చాలా బాధగా అనిపించిందని అన్నారు.

100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాన‌లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరూ ఆలోచించాలని కోరారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు చేపట్టింది. రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందించామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయం అద్భుతమైన దశకు వెళ్లింది. పండిన ప్రతి గింజ కొన్నాం.

ధాన్యం దిగుబడిలో పంజాబ్‌ను దాటి.. అనతికాలంలోనే దేశంలోనే అగ్రస్థానానికి దూసుకుపోయింది. ఇది కట్టుకథ కాదు, పిట్టకథ కాదు, వాస్తవం. మరి ఇంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు ఇంత అధ్వాన్నంగా మారడానికి కారణం ఎవరు..? లోపం ఎక్కడుంది? ఈ విషయంపై ప్రజలతోపాటు జర్నలిస్టు మిత్రులు కూడా బాగా ఆలోచన చేయాలి అని కేసీఆర్‌ సూచించారు. వరి పంటకు రూ. 500 బోనస్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో మళ్లీ జనరేటర్లు, ఇన్వెటర్లు కనిపిస్తున్నాయి

మా ప్ర‌భుత్వ హాయాంలో రూ.35వేల కోట్లతో విద్యుత్ పాలసీ తీసుకొచ్చాం. 7వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని 18వేల మెగావాట్లకు పెంచాం. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా తీర్చిదిద్దాం. 8ఏళ్లు రెప్పపాటు కరెంట్ పోకుండా సరఫరా చేశాం. 5600 మెగావాట్ల పవర్ ను ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కల్పించాం. ఉన్న కరెంట్ వాడుకునే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. తెలంగాణలో మళ్లీ జనరేటర్లు, ఇన్వెటర్లు, కన్వెర్టర్లు కనిపిస్తున్నాయి. పవర్ ఫెయిలూర్స్ కు ఎవరు కారణం. 100 రోజుల్లో ఇంత అస్తవ్యస్తం ఎందుకు?. కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చింది” అని విమర్శించారు.

- Advertisement -

రాష్ట్రంలో కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. మరోవైపు, కాంగ్రెస్‌ హయాంలో పోలీసులు ప్రజలపట్ల, ప్రతిపక్ష పార్టీ శ్రేణులపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ దురుసు ప్రవర్తనను తగ్గించుకోవాలని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికార పార్టీ కోసం దురుసుగా ప్రవర్తించడం సబబు కాదని కేసీఆర్‌ హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement