ఆన్లైన్ గేమింగ్ ఫుల్ బెట్ విలువపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 20వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. ఆన్లైన్ గేమింగ్‌తో పాటు, గుర్రం పందెలు, కాసినోపై 28 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి 20వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా గురువారం తెలిపారు.
ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ 2-3 శాతం జీఎస్టీ మాత్రమే చెల్లిస్తోందని, సామాన్యులు తినే ఆహార పదార్ధాలపై కూడా 5 శాతం జీఎస్టీ ఉందన్నారు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు పన్నులను జీజీఆర్లో 18 శాతంగా చెల్లిస్తున్నాయని, ఇది వాస్తవంలో 2-3 శాతంగా ఉందని జీఎస్టీ కౌన్సిల్‌లోని సభ్యుల్లో ఒకరు చెప్పారని ఆయన తెలిపారు. గత సంవత్సరం వీటిపై జీఎస్టీ రూపంలో 1,700 కోట్లు మాత్రమే వచ్చాయని, తాజా నిర్ణయంతో ఇది 15,000-20,000 కోట్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.
బెట్టింగ్ పూర్తి విలువపై జీఎస్టీ మూలంగా ఈ పెరుగుదుల ఉంటుందని చెప్పారు. గేమింగ్ కంపెనీలు దీన్ని స్కిల్ అండ్ ఛాన్స్ పేరుతో కేవలం ప్లాట్‌ఫామ్ ఫీజుపై లేదా గ్రాస్ గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్) 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నాయని ఆయన తెలిపారు. 28 శాతం పన్నుపై గేమింగ్ కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని, కోర్టు తీర్పు ఆధారంగా దీన్ని వసూలు చేస్తామని ఆయన చెప్పారు.
అప్పటి వరకు 18 శాతం జీఎస్టీ విషయంలో ఎలాంటి ఎగవేతలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ పన్నును తగ్గించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 28 శాతం పన్ను విధించాలన్న నిర్ణయాన్ని ఇండస్ట్రీతో పాటు, అనేక వర్గాలతో విస్తృతంగా చర్చించిన తరువాతే తీసుకున్నారని, జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.