Friday, November 22, 2024

Delhi | డెంటల్ కాలేజీల్లో 20 శాతం సీట్లు ఖాళీ.. విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా డెంటల్ కాలేజీల్లో 20 శాతం సీట్లు ఖాళీగా మిగిలిపోతుండటం పట్ల వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో మంగళవారం నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ… 2016-17 నుంచి 2022-23 విద్యా సంవత్సరాల మధ్య దేశంలోని డెంటర్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లోని 1,89,420 సీట్లలో 23,585 సీట్లు భర్తీ కాలేదని అన్నారు.

డెంటల్ కాలేజీల్లో ఇంత పెద్ద ఎత్తున సీట్లు ఎందుకు మిగిలిపోతున్నాయో ఆరా తీసి ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు. నర్సింగ్‌, డెంటల్‌ కమిషన్ల బిల్లులతో ఆరోగ్య రంగంలో కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టినందుకు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయను అభినందిస్తూ ఈ బిల్లులకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

గత మూడు దశాబ్దాల కాలంలో దేశంలో నోటి జబ్బుల తీవ్రత బాగా పెరిగిపోయింది. దంత సంరక్షణ, నోటి ఆరోగ్య సేవలను విస్తృతపరచే అంశానికి ప్రాధాన్యత లోపించడమే దీనికి కారణంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. దేశంలో 85% పెద్దలు, 60% పిల్లలు దంత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో 50 శాతం మంది తమ సమస్యకు పరిష్కారం కోసం దంత వైద్యుడిని సంప్రదించకుండా మందులు విక్రయించే కెమిస్ట్‌ను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ప్రతి 7500 మందికి ఒక దంత వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది.

అయితే దేశంలో 2020 నాటికే ప్రతి 5000 మందికి ఒక దంత వైద్యుడు ఉన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రతి లక్ష మందికి ఒక దంత వైద్యుడు ఉన్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ అసమానతను సరిదిద్దే విషయమై ప్రభుత్వం, నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌ దృష్టి సారించాలని ఆయన కోరారు. బిడిఎస్‌ విద్యార్ధులకు కూడా బ్రిడ్జి కోర్సు రూపొందించేందుకు డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించినప్పటికీ దానిని ఆచరణలోకి తీసుకురాలేదని అన్నారు.

మరోవైపు వైద్య సేవల రంగంలో నర్సుల పాత్ర ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నదని, పని చేసే ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపుల నుంచి వారికి రక్షణ కరవవుతోందని అన్నారు. లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి నర్సుల కోసం ప్రత్యేక యంత్రాంగం లేనందున వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పించేలా చట్టంలో తగిన సవరణలు చేపట్టాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement