న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణకు 2022-23 సంవత్సరానికిగానూ 20 కొత్త కేజీబీవీలను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు) కేటాయించినట్టు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 4,982 కేజీబీవీలలో 696 అంటే దాదాపు 15% విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలు, మైనారిటీలు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆడపిల్లలకు ఉన్నత విద్యను అందించాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేశారు.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకం సమగ్ర శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 31 కేజీబీవీలను ఆయా రాష్ట్రాలకు కేటాయించగా, అందులో తెలంగాణ రాష్ట్రానికి 20 మంజూరైనట్టు కిషన్ రెడ్డి తెలిపారు. 2018 నుంచి గత నాలుగేళ్లలో 104 నూతన విద్యాలయాలను రాష్ట్రానికి కేటాయించారని ఆయన చెప్పారు.