హైదరాబాద్, ఆంధ్రప్రభ: పేద విద్యార్థులకు చదువును అదించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా మరో 20 కేజీబీవీలు మంజూరయ్యాయి. వీటిని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ మంగళవారం జీవో నెంబర్ 24ను విడుదల చేసింది. వీటిని ఏర్పాటు కోసం రికరింగ్ బడ్జెట్‌గా తొలుత రూ.60 లక్షలను సైతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాల విభజనతో రాష్ట్ర ప్రభుత్వం పలు మండలాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఆయా కొత్త మండలాల్లో కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యార్థుల సౌలభ్యం కోసం విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజలు, నేతల నుంచి ఉంది. ఈనేపథ్యంలోనే మరో 20 కేజీబీవీలను నెలకొల్పాల్సి ఉంది. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2014లో రాష్ట్రంలో కేవలం 391 కేజీబీవీలు ఉండేవి. ఆతర్వాత 2017-18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరుచేశారు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కి చేరింది. తాజాగా మరో 20 కేజీబీవీలు మంజూరు చేయడంతో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్ వరకు, మరో 230 కేజీబీవీలను పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు.
కొత్తగా మంజూరు చేసిన 20 కేజీబీవీలను మావల (ఆదిలాబాద్), బీర్‌పూర్, బుగ్గారం (జగిత్యా), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్‌నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్‌పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్‌పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపే), చౌడాపూర్ (వికారాబాద్)లో ఏర్పాటు చేయనున్నారు.