Friday, November 22, 2024

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, మాది రోజ్‌గార్‌ బడ్జెట్: అరవింద్‌ కేజ్రీవాల్‌

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూపొందించిన రోజ్‌గార్‌ బడ్జెట్‌ అద్భుతమని ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. 75,800 కోట్ల 2022-23 బడ్జెట్‌ను శనివారం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మనీష్‌ సిసోడియా ప్రవేశపెట్టగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశంసించారు. ఢిల్లి ఆర్థిక ప్రగతికి, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే బడ్జెట్‌గా అభివర్ణించారు. దేశ రాజధానిలో రాత్రి ఆర్థికవ్యవస్థను ప్రోత్సహించడానికి చిల్లర, హోల్‌సేల్‌ మార్కెట్లకు బలం చేకూర్చేందుకు, ఎలక్ట్రానిక్‌ సిటీని ఏర్పాటు చేసేందుకు ఈ బడ్జెట్‌ అవకాశం కల్పిస్తోందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌ మొత్తం 9.86 శాతం పెరిగిందని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజ్‌గార్‌ బడ్జెట్‌వల్ల యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి 9,669 కోట్లు, విద్యారంగానికి 16,278 కోట్లు కేటాయించిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సిసోడియా మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రూ. 4,500 కోట్లు వెచ్చిస్తామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 800 కోట్లు ఖర్చు పెడతామని తెలిపారు. సిసోడియా ఇప్పటివరకు వరుసగా ఎనిమిదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. రోజ్‌గార్‌ బడ్జెట్‌లోభాగంగా కేజ్రీవాల్‌ ప్రభుత్వం షాపింగ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహించనున్నది. పర్యాటకులను ఆకర్షించి చిల్లర వర్తకులకు మేలు చేసేందుకు ఈ పథకం అమలు చేయనున్నారు. బప్రోలాలో తలపెట్టిన ఎలక్ట్రానిక్‌ సిటీవల్ల 80 వేల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. రాత్రి ఆర్థికవ్యవస్థ ఆలోచనకు మద్దతుగా రాత్రి 8 నుంచి 2వరకు ట్రక్‌ల రాకపోకలకు అనుమతివ్వనున్నామని ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement