Saturday, October 5, 2024

CMD Balaram | రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలి

వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో… సింగరేణిలోని అన్ని ఏరియాల్లో నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలంటే రోజుకు కనీసం రెండు లక్షల పది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బొగ్గు రవాణా చేయాలని, 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణాపై సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో పెద్ద ఎత్తున నిలిచిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. అవసరమైతే అదనపు పంపులను వినియోగించాలన్నారు. తద్వారా నిర్దేశిత ఓవర్ బర్డెన్ తొలగింపు, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది. దీనిపై అన్ని ఏరియాల జీఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

అలాగే బొగ్గు నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి వినియోగదారుల విశ్వాసాన్ని పెంచాలని సూచించారు. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన నైనీ కోల్‌బ్లాక్, వీకే ఓపెన్ కాస్ట్, రొంపేడు ఓపెన్ కాస్ట్, గోలేటి ఓపెన్ కాస్ట్ గనులకు అటవీ పర్యావరణ అనుమతులు లభించాయని, గనుల ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు ప్రతి ఏరియా సాధించిన ఉత్పత్తి లక్ష్యాలను సమీక్షించారు.

ఇప్పటికే అర్ధ సంవత్సరం పూర్తయిన సందర్భంగా, మిగిలిన కాలంలో ఇచ్చిన లక్ష్యాలను మించి ఉత్పత్తులు సాధించాలన్నారు. ఏరియా జనరల్ మేనేజర్లు ఎత్తిచూపిన కొన్ని సమస్యలపై వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి తక్షణమే ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సమావేశంలో ఆయనతోపాటు డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు, జి.వెంకటేశ్వర రెడ్డి, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎస్.డి.ఎం.సుభాని, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ రవిప్రసాద్, జనరల్ మేనేజర్ సి. పి. పి. పి.రవికుమార్, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాల కార్పొరేట్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement