న్యూఢిల్లీ : కమర్షియల్ వాహన రేంజ్ ధరలను పెంచబోతున్నట్టు దేశంలోనే అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీదారు టాటా మోటార్స్ ఇండియా ప్రకటించింది. ధరల పెరుగుదల 2.5 శాతం మధ్య ఉంటుందని కంపెనీ వివరించింది. ధరల పెరుగుదల జనవరి 1, 2022 నుంచి ఆచరణలోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఎంఅండ్‌హెచ్‌సీవీ, ఐఅండ్‌ఎల్‌సీవీ, ఎస్‌సీవీ, బస్ అన్ని సెగ్మెంట్లలోనూ వ్యక్తిగత మోడల్, వాహన వేరియమెంట్‌ను బట్టి ధరలు పెంపు ఉంటుందని కంపెనీ వివరించింది. స్టీల్, అల్యూమినియం, ఇతర విలువైన మెటల్స్‌తోపాటు ఇతర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ఇన్‌పుట్ వ్యయాలు ఎక్కువయ్యాయని కంపెనీ వివరించింది.
ఈ కారణంగా వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ వివరించింది. దాదాపు అన్ని రంగాలకు చెందిన వాహనాలను తయారు చేస్తుండడంతో భారం భారీగా పెరిగిపోయింది. భారీ స్థాయిలో ఉన్న భారాన్ని కస్టమర్లపై కొంతైనా మోపాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ పేర్కొంది. కార్ మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియాతోపాటు లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్, ఆడీ కూడా కార్ల ధరలు పెంచుతున్నట్టు గత గురువారమే ప్రకటించిన విషయం తెలిసిందే.