దేశానికి చెందిన ఆటోమొబైల్ దిగ్గజ కంపెనని మారుతి సుజుకీ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు కంపెనీ 2.5 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. 1983 డిసెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించిన మారుతీ 1994 నాటికి 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీగా ఎదిగింది. 2011లో కోటి వాహనాల మైలురాయిని చేరుకుంది. 2018 జులై నాటికి కంపెనీ 2 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. నాలుగు సంవత్సరాల్లోనే 50 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయడంతో మొత్తం 2.5 కోట్ల వైలురాయిని చేరుకున్న కంపెనీగా అరుదైన ఘనతను సాధించింది.
హర్యానాలోని గురుగ్రావ్‌లో తొలి కార్మగారాన్ని ప్రారంభించిన మారుతీ, మనేసర్‌లో మరో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ రెండు ప్లాంట్ల ద్వారా సంవత్సరానికి 15 లక్షల వాహనాలను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. మారుతి ఇటీవలే 40వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఇదే సంవత్సరం ఈ మైలురాయిని చేరుకోవడం పట్ల సంతోషంగా ఉందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి చెప్పారు. ఎప్పటికప్పడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకు వస్తామని ఆయన తెలిపారు. వినియోగదారుల నుంచి ఇదే మద్దతు కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మారుతి సుజుకీ ప్రస్తుతం సీఎన్‌జీ వాహనాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇటీవలే విటారా గ్రాండ్ పేరుతో హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్‌లో లాంచ్ చేసింది. త్వరలోనే పూర్తి స్థాయి విద్యుత్ కారును తీసుకు వచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రారంభంలో ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన మారుతి తరువాత కాలంలో ప్రభుత్వం దాన్ని జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీకి విక్రయించింది. దీంతో ఇది మారుతి సుజుకీ బ్రాండ్‌పైనే కార్లను ఉత్పత్తి చేస్తోంది.