అస్సాం వ్యాపారవేత్త నవీన్చంద్ర బోరా ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని విభిన్నంగా చాటిచెప్పేందుకు పూనుకున్నారు. 60 అడుగుల పీఠం, 190 అడుగుల విగ్రహం కలిసి మొత్తం 250 అడుగుల ఎత్తులో నిర్మించనున్న ఈ విగ్రహం కోసం దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బోరా తెలిపారు.
ఈ మేరకు గువాహటి నగరానికి సమీపంలో ఉన్న తన జాగాలో భూమిపూజ చేశారు ఈ పూజా కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగనుంది. పీఠభాగంతో కలుపుకొని విగ్రహం ఎత్తు 250 అడుగులు ఉంటుందని నవీన్చంద్ర తెలిపారు. విగ్రహం మెడపై అస్సాం సంస్కృతికి చిహ్నంగా గమోసా (అస్సామీలు ధరించే ఖద్దరు ఉత్తరీయం) ఉంటుందని వివరించారు. విగ్రహ ప్రతిష్ఠాపన వివరాలతో గతేడాది ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రధానులలో మోదీ ఒకరని, ఆయన విగ్రహాన్ని నెలకొల్పే అవకాశం రావడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీతోనే ఆవిష్కరింపజేయాలని ఆయన యోచిస్తున్నారు.