హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని వనస్థలీపురంలో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా, హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు నిందితుల్ని పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న నైజీరియన్‌ను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. భాగ్యనగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ అధికారులు ఎంత ప్రయత్నించినా, స్మగ్లర్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా దందా సాగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఒక నైజీరియన్ బెంగళూరు నుండి నగరానికి వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అధికారులకు ముందస్తు అందింది. అప్రమత్తమైన హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, 180 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ నగరంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో ఇదే అధికమొత్తంలో పట్టుబడిన కేసు కావడం గమనార్హం. నైజీరియన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్త్తున్నారు.