Friday, November 22, 2024

మార్కెట్లోకి 18.05 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు.. ఓపెన్ మార్కెట్లో ఈ-వేలం ద్వారా విక్రయించిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) వద్ద ఉన్న 18.05 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్‌కు కేంద్ర ప్రభుత్వం విక్రయించింది. ఈ-వేలం విధానంలో 3 విడతలుగా ఈ మొత్తం నిల్వలను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, కొన్ని దేశాల్లో నెలకొన్న ఆహార సంక్షోభం వంటి అంతర్జాతీయ పరిణామాలతో దేశీయంగా ఆహార ధరల సూచీలు పెరిగాయి. సామాన్య ప్రజలు వినియోగించే ఆహార పదార్థాల ధరలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న కేంద్రం, ధరలు అదుపుచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గోధుమ ధరలను నియంత్రించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న నిల్వల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్లో విక్రయించాలని జనవరి 25న నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

ఇందులో భాగంగా ఇప్పటి వరకు మూడు విడతల్లో 18.05 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను వేలం వేయగా, 11 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలయ్యాయి. వినియోగదారులకు ప్రయోజనం అందించేందుకు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ (డొమెస్టిక్) ద్వారా అధిక సబ్సిడీ ధరలకు మార్కెట్లోకి విడుదల చేస్తున్న కేంద్రం, ఆ ప్రయోజనాలు వినియోగదారులకు అందేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మిల్లర్లు, హోల్‌సేలర్లతో సమావేశాలు నిర్వహించింది.

తాజాగా జరిగిన 3వ విడత ఈ-వేలం ప్రక్రియలో సగటున క్వింటాలుకు రూ. 2,172 ధరతో 23 రాష్ట్రాల్లోని 620 ప్రదేశాల్లో 1,269 మంది బిడ్డర్లు 5.07 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను దక్కించుకున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2,150 రిజర్వు ధరగా నిర్ణయించగా.. ఫిబ్రవరి 2న జరిగిన మొదటి విడత ఈ-వేలంలో 9.13 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సగటున క్వింటాలుకు రూ. 2,474 చొప్పున విక్రయించగా, ఫిబ్రవరి 15న జరిగిన 2వ విడత వేలంలో సగటున క్వింటాలుకు ధర రూ. 2,338 పలికింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement