న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గడిచిన ఐదేళ్ళలో కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) పథకానికి రూ.179.07 కోట్లు, ఎన్‌ఎపీఎస్‌కు 2020 నుంచి 2022 వరకు రూ.6.58 కోట్లు, జన్‌శిక్షణ్ సంస్థాన్‌లకు రూ.10.64 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కోసం పీఎంకేవీవై, జన్‌శిక్షణ్ సంస్థాన్ (జేఎస్‌ఎస్), నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీం (ఎన్‌ఎపీఎస్), ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఐటీఐ)లను అమలు చేస్తున్నట్లు కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
నవోదయలో ఈ క్లాస్ రూంలు..
తెలంగాణలోని 9 జవహర్ నవదోయ విద్యాలయాల్లో ఈ క్లాస్ రూంలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీఆర్‌ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, రంజిత్‌రెడ్డి, మాలోత్ కవిత, పసునూరి దయాకర్‌లు అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. రాష్ట్రంలోని 35 కేవిలలో 26 కేంద్రీయ విద్యాలయాలు (కేవీ)లు తగిన మౌలిక సదుపాయాలతో శాశ్వత భవనంలో పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. 9 కేవీలు నిబంధనల ప్రకారం స్పాన్సరింగ్ అథారిటీ అందించిన తాత్కాలిక వసతిలో నడుస్తున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న జేఎన్‌వీల్లో మౌలిక సదుపాయాల లోపాలు లేవని నవోదయ విద్యాలయ సంఘటన్ స్పష్టం చేసిందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.