Tuesday, November 26, 2024

Delhi | సూడాన్ నుంచి ఢిల్లీ చేరిన 17 మంది తెలంగాణ వాసులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను తరలించే ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా శుక్రవారం 392 మందితో ఢిల్లీ చేరుకున్న వాయుసేన విమానంలో 17 మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. విమానం ఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండవగా, వచ్చినవారిలో వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఆయా రాష్ట్రాల భవన్ సిబ్బంది తమ రాష్ట్రాలకు చెందినవారిని గుర్తించేందుకు ప్లకార్డులు పట్టుకుని హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

- Advertisement -

విమానంలో చేరుకున్నవారికి స్వయంగా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ స్వాగతం పలికారు. తెలంగాణకు చెందిన 17 మందిని గుర్తించగా, వారిలో 13 మంది అప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారిని ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు తరలించగా, మిగతా నలుగురిని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు తరలించి భోజనం, వసతి సదుపాయాలు కల్పించారు. ఆ నలుగురికి శనివారం ప్రయాణానికి ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement