వేదికగా చిలకలూరిపేట..
చంద్రబాబు, పవన్ ల ప్రసంగాలు..
భారీగా ఏర్పాట్లు చేయాలని బాబు ఆదేశం..
అమరావతి – ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారైందని, సీట్ల పంపకం ఒక్కటే మిగిలుందని వెల్లడించారు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు . బిజెపి అగ్రనేత అమిత్ షాతో ఢిల్లీలో చర్చలు ముగిసిన అనంతరం ఆయన టెలికాన్ఫ్ రెన్స్ ద్వారా ఎపిలో ఉన్న కీలక నేతలతో మాట్లాడారు.. పొత్తు కుదిరిందని, సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. జనసేన, బీజేపీలకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు ఇస్తున్నామని సూచనప్రాయంగా తెలిపారు.
అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులని నేతలకు చెప్పారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని టీడీపీ అధినేత తెలిపారు.
చిలకలూరిపేటలో మోదీ సభ ….
టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తుపై ఎలాంటి గందరగోళం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏపీ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, కేంద్రం సహకారం అవసరమని, పొత్తుకు ఇదే కారణమని చంద్రబాబు నేతలకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 17న టీడీపీ-జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించామని చెప్పారు. మూడు పార్టీలు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తామని నేతలతో చంద్రబాబు తెలిపారు. మోడీ పాల్గొనే సభకు ఒక రోజు అటు ఇటు అయినా అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని నేతలకు సూచించారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.