కరోనా చర్యలపై విమర్శించిన వారి నోళ్లూ మూయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కరోనా నియంత్రణలో, చికిత్స, టీకాల సౌకర్యాలు కల్పించడంలో కంద్రం అలసత్వం చూపిందని దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల మీడియాలు కూడా విమర్శిస్తున్నాయి. విమర్శలపై స్పందించి దిద్దుబాటు చర్యలు చేయాల్పిన మోదీ సర్కారు విమర్శలు చేసిన వారిపై కొరడా ఝుళిపిస్తోంది.
మోదీ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకున్న చర్యలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో ఇటీవల వెలసిన పోస్టర్లపై పోలీసులు చర్య తీసుకున్నారు. వీటికి సంబంధించి వివిధ చట్టాల కింద 21 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేశారు. ఢిల్లీలోని నాలుగు డివిజన్లలో ఈ అరెస్టులు జరిగాయి. అంటే పైస్థాయి సమన్వయంతోనే ఇవి జరిగినట్టు భావిస్తున్నారు. ‘మోదీజీ, ఆప్నే హారే బచ్చోకి వ్యాక్సిన్ విదేశ్ క్యూ భేజ్ దియా’ (మోదీ గారూ మీరు మా పిల్లల టీకాలు విదేశాలకు ఎందుకు పంపించారు?) అని ఓ పోస్టరులో ఉంది. ‘మరిన్ని ఫిర్యాదులు వస్తే మరిన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తాం.. ప్రస్తుత దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరి ప్రోత్సాహంతో ఈ పోస్టర్లు వేశారో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం’ అని ఓ సీనియర్ పోలీసు అధికారి వివరించారు.