తెలుగుపీపుల్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం ఆదివారం (డిసెంబరు 10) న్సూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ పాలస్లో విజయవంతంగా జరిగింది. సుమారు వెయ్యి మంది హాజరైన ఈ కార్యక్రమంలో లక్షా మూడు వేల డాలర్ల విరాళాలు సేకరించినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త, ఫండ్ రైజింగ్ డైరక్టర్ ప్రవీణ్ గూడూరు, వార్షికోత్సవ కార్యక్రమ కన్వీనర్ బోయపాటి అరవింద బాబు తెలిపారు. ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త ఈ సందర్భంగా సంస్థ కార్యక్రమాలను వివరించారు.
76 మందిలో 13 మంది డాక్టర్లుగా..
ఈ ఏడాది 76 మందిని స్పాన్సర్ చేయగా అందులో 13 మంది డాక్టర్లు కాబోతున్నారని తెలిపారు. ఒక వైద్యవిద్యార్థి తండ్రి ఓ ఆసుపత్రి ముందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా ఒక గిరిజన విద్యార్థి లాయరు కాబోతున్నాడనీ, తమ సామాజిక వర్గంపై జరుగుతున్న అణచివేతను ఎదుర్కోవడమే తన ధ్యేయమని ఆయన అన్నారు. కార్యక్రమానికి న్యూజెర్సీ, చుట్టుపక్కల ప్రాంతాల తెలుగు ప్రజలు, తానా, నాటా, మాటా, నాట్స్, టీఫాస్, ఎన్ జె టి ఎ, ఆటా, టిటిఎ, ఎన్నారైవిఏ, ఆటీ తదితర తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరై సహకారం అందించారు.
కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు..
న్యూజెర్సీ అసెంబ్లీకి పలు పర్యాయాలు ఎన్నికైన ఉపేంద్ర చివుకుల, తెలుగు ప్రముఖులు దాము గేదెల, ప్రదీప్ సువర్ణ, రవి ధనపునేని, నాట్స్ చైర్ పర్సన్ అరుణ గంటి, టీఫాస్ అధ్యక్షుడు మధు రాచకుళ్ల, ఎన్ జెటిఎ వ్యవస్థాపకురాలు మంజుభార్గవ, నాటా డైరక్టర్ ఉషా చింతా, మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, తానా నాయకులు రామకృష్ణ వాసిరెడ్డి, ఎన్నారైవిఎ నాయకులు వెంకట శ్రీరాం, టీటీఎ నుంచి సుధాకర్ ఉప్పల, ఆటీ నుంచి కిషోర్ లింగమల్లు, కుమారరాజా సదరం తదితరులు హాజరయ్యారు.
కాగా, కార్యక్రమాన్ని యాంకర్ శ్రీలక్ష్మి నిర్వహించారు. ప్రముఖకళాకారులు మిమిక్రీ రమేష్, గాయనీగాయకులు సుమంగళి, సుందరి, అర్జున్, అన్విత, సమీర, మధు శ్రోతలను అలరించి విరాళాల సేకరణకు సహకరించినట్టు వారు తెలిపారు. దీనికి సహకరించిన వలంటీర్లు, సన్నిహితులు, దాతలు, స్పాన్సర్లు, మీడియా మితృలందరికీ కన్వీనర్ అరవింద బాబు కృతజ్ఞతలు తెలిపారు.