Tuesday, November 26, 2024

బెంగళూరు అభ్యర్థుల్లో 157 మంది కోటీశ్వరులు.. ధనవంతులకే పార్టీల టికెట్లు

బెంగళూర ప్రాంతంలో 28 అసెంబ్లి స్థానాలకు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేస్తున్న 384 మంది అభ్యర్థుల్లో 157 మంది కోటీశ్వరులని అభ్యర్థుల అఫిడవిట్లను సంయుక్తంగా అధ్యయనం చేసిన కర్నాటక ఎలెక్షన్‌ వాచ్‌, బెంగళూరు ఎలెక్షన్‌ వాచ్‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ ఫోరమ్స్‌(ఏడీఆర్‌) ఒక నివేదికలో పేర్కొన్నాయి. పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల్లో 41 శాతం మంది కోటీశ్వరులని నివేదిక తెలిపింది.

87 మంది అభ్యర్థులు వారి ఆస్తుల విలువ రూ.5 కోట్లకుపైగా ఉంటుందని ప్రకటించగా, 37 మంది వారి ఆస్తుల విలువ రూ.2 కోట్లు నుంచి రూ.5 కోట్ల మధ్య ఉంటుందని, 76 మంది వారి ఆస్తుల విలువను రూ. 50 లక్షలు నుంచి రూ.2 కోట్ల మధ్య చూపించగా, 114 మంది అభ్యర్థుల ఆస్తుల విలువ రూ.10 లక్షల లోపు ఉందని నివేదిక వెల్లడించింది. మొత్తం మీద అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ధనవంతులకే పార్టీ టికెట్లు ఇచ్చాయని తెలిపింది.

92 మందిపై క్రిమినల్‌ కేసులు..

- Advertisement -

బెంగళూరు ప్రాంతంలో 28 అసెంబ్లి స్థానాలకు పోటీ చేస్తున్న మొత్తం 384 మంది అభ్యర్థుల్లో 92 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని కర్నాటక ఎలెక్షన్‌ వాచ్‌, బెంగళూరు ఎలెక్షన్‌ వాచ్‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ ఫోరమ్స్‌(ఏడీఆర్‌) సంయుక్తంగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నాయి. వారిలో 57 మందిపై నమోదైన కేసులు తీవ్రమైన అభియోగాలతో కూడుకొని ఉన్నాయని సదరు నివేదిక వెల్లడించింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారిలో బీజేపీ నుంచి 14 మంది, కాంగ్రెస్‌ నుంచి 19 మంది, జేడీ(ఎస్‌) నుంచి తొమ్మిది మంది, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నారని తెలిపింది.

తీవ్రమైన అభియోగాలతో క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారిలో బీజేపీ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు, కాంగ్రెస్‌ నుంచి 10 మంది, జేడీ(ఎస్‌) నుంచి ఎనిమిది మంది, ఆప్‌ నుంచి ఒక అభ్యర్థి ఉన్నారని నివేదిక వెల్లడించింది. ఐదుగురు అభ్యర్థులపై మహిళలపై నేరానికి పాల్పడిన కేసులు ఉండగా, నలుగురు అభ్యర్థులపై హత్య నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయని, తొమ్మిది మందిపై హత్యా యత్నం కేసులు నమోదయ్యాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement