హైదరాబాద్, ఆంధ్రప్రభ: నీటిని ఒడిసిపట్టి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తూ పెండింగ్ పనుల్లో వేగం పెంచుతోంది.
కరువు జిల్లాగా ముద్రపడి, వలసలకు కేంద్రమైన పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పనుల్లో వేగం పెంచింది. ఈ మేరకు 1955 నుంచి పనులు కొనసాగుతూ లక్ష్యం చేరుకోని కోయిల్ సాగర్ నిర్మాణం వైపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
గత భారాస ప్రభుత్వంలో డిజైన్లు మార్చి నిర్మాణ పనులు, అంచనా వ్యయాలు పెంచినప్పటికీ ఇంకా 15వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందకపోవడంతో నీటిపారుదల శాఖ ఆమేరకు దృష్టి నిలిపింది. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాలతో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ సమీక్షలు నిర్వహిస్తోంది.
ఈ మేరకు ఉన్నతాధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తూ కోయిల్ సాగర్ పనుల్లో వేగం పెంచేందుకు కృషి చేస్తున్నారు. మహబూబ్‌నగర్ పూర్వ జిల్లా అమరచింత నియోజకవర్గంలో 12వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1955లో కోయిల్ సాగర్ నిర్మాణాన్ని నాటి ప్రభుత్వం ప్రారంభించింది.
అయితే ప్రారంభంలోనే భూసేకరణ సమస్య రావడంతో పెండింగ్‌లో ఉంది. ప్రియదర్శిని జూరాల నుంచి రెండు దశల్లో మొత్తం 118 మీర్ల ఎత్తులో కోయిల్ సాగర్ ప్రాజెక్టు కోసం కృష్ణా ట్రిబ్యునల్ 3.90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అనుమతుల మేరకు పనులు కొనసాగిస్తే 15వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి.
జలయజ్ఞంలో భాగంగా 11 నవంబర్ 2005న సీఏడీ మధ్యతరహా సాగునీటి శాఖ జీడబ్ల్యూ ఆర్‌టీ నంబరు 1658 ద్వారా ప్రభుత్వం రూ.359 కోట్ల పరిపాలన అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత సమరించిన అంచనా మేరకు రూ.567కోట్ల 22లక్షలకు జీవో ఎంఎస్ నం.30-26-5 మేరకు 2017లో భారాస ప్రభుత్వం అంచనాలను సవరించింది.
డిసెంబర్ 23నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పటికీ లక్ష్యం నెరవేరలేదు. భూసేకరణ సమస్యలతో పాటు గుత్తేదారుల నిర్లక్ష్యంతో సంపూర్ణంగా పనులు పూర్తి కాకపోవడంతో పెండింగ్ ఆయకట్టు మిగిలింది. ప్రస్తుతం సవరించిన అంచనాల మేరకు పెండింగ్ నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో రూ.150 కోట్లు విడుదల చేసి పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించింది. 15వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ప్రారంభమై ఈ ప్రజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసి మరో 3వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది.